Old vs New Tax Regime: 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీ 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించబడిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కేవలం 12 రోజులు మాత్రమే ఇంకా గడువు మిగిలి ఉంది. ఒకవేళ ఈ గడువు మిస్ అయితే ఆలస్య రుసుములు, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31 వరకు లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే పన్ను చట్టాల పమితికి మించి ఆదాయం కలిగిన డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు సహా ఇతర వేతనజీవులు ఇప్పటికీ అసలు పాత టాక్స్ రీజిమ్ కింద రిటర్న్ ఫైల్ చేయాలా లేక కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అనే అనుమానంలో ఉన్నారు. దీనికి తోడు అసలు గతంలో ఎంచుకున్నదే విధానమే ఫాలో అవ్వాలా మారొచ్చా అనే అనుమానాలకు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సామాన్యంగా జీతం పొందే ఉద్యోగులు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే సమయంలో పాత లేదా కొత్త టాక్స్ విధానం మధ్య స్విచ్ అవ్వటానికి పన్ను చట్టాలు అనుమతిస్తున్నాయని టాక్స్ నిపుణులు చెబుతున్నారు ఇలా మార్పు చేసుకునేందుకు వారికి స్వేచ్చ ఇవ్వబడిందని చెబుతున్నారు. ఉద్యోగులు సంవత్సరాంతంలో మొదటగా ఎంప్లాయర్‌కు పేర్కొన్న విధానాన్ని కాకుండా.. ITR ఫైలింగ్ సమయంలో వేరే పన్ను విధానాన్ని(టాక్స్ రీజిమ్) ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం డీఫాల్ట్ టాక్స్ విధానాన్ని న్యూ రీజిమ్ గా సెట్ చేశారన్నదే.
టాక్స్ రీజిమ్ స్విచ్చింగ్ ఎలా చేయాలి..?
* టాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సరైన ITR ఫారమ్ (ITR-1/ITR-2) ఎంచుకొని, పాత లేదా కొత్త టాక్స్ విధానం అనే ఎంపికను సెట్ చేయాలి.
* జీతం మాత్రమే ఆధారంగా ఆదాయం ఉన్న వారికి ప్రతి సంవత్సరంలోను టాక్స్ రీజిమ్ మార్పుకు అవకాశం ఇవ్వబడింది. అయితే వ్యాపార ఆదాయం ఉన్నవారు మాత్రం పాత పాలనకు తిరిగి మారేందుకు ప్రత్యేక ఫారమ్ (Form 10-IEA) దాఖలు చేయాల్సి ఉంటుంది.
* టాక్స్ నియమాలకు అనుగుణంగా రిటర్న్ ఫైలింగ్ గడువు తేదీలోపు చేసిన వారు మాత్రమే పాత విధానం ఎంచుకోవటానికి వీలు ఉంటుందని గమనించాలి. ఆలస్యంగా ITR ఫైలింగ్ చేస్తే పాత పాలన ఎంచుకునే అవకాశం ఉండదు.
పన్ను రిటర్న్స్ దాఖలు సమయంలో ఉద్యోగులకు మార్పు స్వేచ్ఛ ఉంది. TDS కట్ చేసిన సమయంలో ఎంపిక చేసుకున్న పన్ను విధానాన్నే తప్పనిసరిగా ITRలో కొనసాగాల్సిన అవసరం లేదు. అయితే తమ ఆదాయంలో ఉన్న అన్ని డిడక్షన్స్, తగ్గింపులను ఖచ్చితంగా గణించుకోవాలి. ఎవరికైతే హోమ్ లోన్, HRA, ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ వంటివి ఉన్న వ్యక్తులు పాత పన్ను విధానంలో ప్రయోజనం ఎక్కువగా పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉద్యోగి రిటర్న్ ఫైలింగ్ సమయంలో పాత పన్ను విధానం అలాగే కొత్త పన్ను విధానం రెండింటిలో తనకు వస్తున్న పన్నును లెక్కించుకుని తనకు ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటే దానిని ఎంచుకోవటం మంచిదని టాక్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.


