NHAI Digital Toll Collection : జాతీయ రహదారులపై మీ ప్రయాణం తరచుగా సాగుతుందా.? ప్రతీ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ రీఛార్జ్ గురించిన చింత మిమ్మల్ని వేధిస్తోందా..? అయితే, మీకో శుభవార్త. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తీసుకువచ్చిన ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా వాహనదారుల మన్ననలను పొందుతోంది. ఆగస్ట్ 15న ప్రారంభమైన ఈ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కేవలం తొలి రోజు సాయంత్రం 7 గంటలకే దాదాపు 1.4 లక్షల మంది ఈ పాస్‌ను కొనుగోలు చేసి, యాక్టివేట్ చేసుకున్నారంటే దీని ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏమిటీ వార్షిక పాస్..? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి…? ఎలా పొందాలి..?
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా, టోల్ ప్లాజాల వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం, వేగవంతం మరియు పొదుపుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. సుమారు 98% టోల్ వసూళ్లు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ వార్షిక పాస్ విధానం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తోంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏమిటి : ఇది ఒక ప్రీపెయిడ్ ప్లాన్. దీని కింద వాహనదారులు ఒకేసారి రూ. 3,000 చెల్లించడం ద్వారా ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల వరకు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే, దానితో పాస్ గడువు మిగిసిపోతుంది. ఈ పథకం ప్రస్తుతం ప్రైవేట్ మరియు వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.
పాస్‌ను ఎలా పొందాలి : ఈ వార్షిక పాస్‌ను పొందడం చాలా సులభం. దీనికోసం కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఉన్న మీ ఫాస్టాగ్‌కే దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ‘Rajmargyatra’ అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
లాగిన్ అవ్వండి: మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) లేదా మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
అర్హతను సరిచూసుకోండి: మీ వాహనం మరియు ఫాస్టాగ్ వివరాలను నమోదు చేయగానే, సిస్టమ్ మీ పాస్ అర్హతను ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. మీ ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండటం, బ్లాక్‌లిస్ట్‌లో లేకపోవడం తప్పనిసరి.
చెల్లింపు చేయండి: అర్హత నిర్ధారణ అయిన తర్వాత, రూ. 3,000 వార్షిక పాస్ ఆప్షన్‌ను ఎంచుకుని యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి. మీ ఫాస్టాగ్ వ్యాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఈ చెల్లింపు కోసం ఉపయోగించడం సాధ్యపడదు.
యాక్టివేషన్: చెల్లింపు విజయవంతం అయిన రెండు గంటల్లోపు మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీకు SMS ద్వారా నిర్ధారణ సందేశం అందుతుంది.
ప్రయోజనాలు అపారం.. ఆదాకు మార్గం..
డబ్బు ఆదా: తరచుగా ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో లాభదాయకం. సగటున ఒక ట్రిప్‌కు అయ్యే టోల్ ఖర్చు రూ. 15కి పడిపోతుంది, దీనివల్ల ఏడాదికి సుమారు రూ. 7,000 వరకు ఆదా అవుతుందని అంచనా.
సమయం ఆదా: పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమ తప్పుతుంది. టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ లేకుండా వేగంగా ముందుకు సాగిపోవచ్చు.
సులభమైన ప్రయాణం: బ్యాలెన్స్ అయిపోతుందన్న ఆందోళన లేకుండా ఏడాది పాటు నిశ్చింతంగా ప్రయాణించవచ్చు.
ముఖ్యమైన గమనికలు : ఈ పాస్ కేవలం NHAI పరిధిలోని జాతీయ రహదారులు (NH) మరియు జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేల (NE) పై ఉన్న టోల్ ప్లాజాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర రహదారులు, స్థానిక సంస్థలు నిర్వహించే టోల్ రోడ్లపై ఇది చెల్లదు. అలాగే, ఈ పాస్‌ను ఇతరులకు బదిలీ చేయడానికి వీలులేదు మరియు వాపసు కూడా ఇవ్వబడదు.


