Expired products during festival sales : బతుకమ్మ, దసరా పండగలొచ్చేశాయ్! సూపర్ మార్కెట్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. పండగ పూట కొత్త వస్తువులు, తక్కువ ధరలకే నిత్యావసరాలు దొరుకుతున్నాయని సంబరపడిపోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొంటున్నవి నాణ్యమైనవేనా? ఆఫర్ల వెనుక దాగి ఉన్న అసలు మాయాజాలం ఏంటి? తక్కువ ధరకు ఆశపడితే జేబుకే కాదు, ఆరోగ్యానికీ చిల్లు పడే ప్రమాదం పొంచి ఉంది. ఇంతకీ సూపర్ మార్కెట్లలో ఏం జరుగుతోంది? వినియోగదారులుగా మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి..?
ఆఫర్ల ఆకర్షణ.. మోసాల నిరసన : పట్టణం, పల్లె తేడా లేకుండా సూపర్ మార్కెట్ సంస్కృతి విస్తరించింది. బతుకమ్మ, దసరా వంటి పండగల సమయంలో ఈ సందడి మరింత పెరుగుతుంది. ఒకే చోట అన్ని వస్తువులు దొరకడం, ఆఫర్ల హోరుతో వినియోగదారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, దీన్నే అదనుగా చేసుకుంటున్న కొన్ని యాజమాన్యాలు, నాణ్యత లేని, గడువు తీరిన (ఎక్స్‌పైరీ అయిన) సరుకులను అంటగడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పండగ రద్దీలో వినియోగదారులు అన్ని వివరాలు చూసుకోరనే ధీమాతో ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
కాగజ్‌నగర్ ఘటన కనువిప్పు కావాలి : ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఐదు రోజుల క్రితం ఇద్దరు యువకులు కొనుగోలు చేసిన శీతలపానీయాలు గడువు తీరినవిగా గుర్తించారు. యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో, బాధితులు మున్సిపల్, ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఇది మచ్చుకు ఒక్క ఉదాహరణ మాత్రమే. తెలియకుండా ఇలాంటి గడువు తీరిన వస్తువులు కొని ఎంతమంది మోసపోతున్నారో, ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారో ఊహించవచ్చు.
అప్రమత్తతే అసలైన ఆయుధం – ఏం చేయాలి : వినియోగదారులు పండగ కొనుగోళ్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.
గడువు తేదీ (Expiry Date) గమనించండి: ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు, బేకరీ పదార్థాలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనేటప్పుడు తయారీ తేదీ (Manufacturing Date), గడువు తేదీ (Expiry Date) తప్పనిసరిగా చూడాలి.
ప్యాకేజింగ్ పరిశీలించండి: ప్యాకెట్ చిరిగిపోయినా, ఉబ్బిపోయినా, రంగు మారినా అనుమానించాల్సిందే. అలాంటి వస్తువులను కొనకపోవడమే ఉత్తమం.
ధరల మాయాజాలం: ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ వంటి ఆఫర్ల విషయంలో జాగ్రత్త. ఉచితంగా ఇచ్చే వస్తువు నాణ్యతను, గడువు తేదీని కూడా పరిశీలించడం మరవద్దు.
బిల్లు భద్రం: కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేయడానికి బిల్లు కీలకమైన ఆధారం.
అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార భద్రత అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మంచిర్యాల మినహా నిర్మల్, కుమురంభీం జిల్లాలకు ఒక్కరే అధికారి ఉండగా, ఆదిలాబాద్‌లో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తినా, తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
మోసపోతే ఏం చేయాలి : ఒకవేళ మీరు నాణ్యత లేని లేదా గడువు తీరిన వస్తువులు కొని మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి, బిల్లుతో సహా ఫిర్యాదు చేస్తే న్యాయం పొందే అవకాశం ఉంది.


