New GST slab rates India 2025 : పండగ పూట మీ ఇంట్లోకి కొత్త కారు తేవాలనుకుంటున్నారా? అధునాతన మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి..! కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలతో మీ కల ఊహించిన దానికంటే తక్కువ ఖర్చుతోనే నెరవేరవచ్చు. సామాన్యుడిపై పన్ను భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా, ఏకంగా జీఎస్టీ స్వరూపాన్నే మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంతకీ ఈ కొత్త విధానంలో పన్నుల స్వరూపం ఎలా మారనుంది..? సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే ఆ వస్తువులేంటి..? అందరూ ఎదురుచూస్తున్నట్లుగా పెట్రోల్, మద్యం ధరలు కూడా తగ్గుతాయా..?
ప్రధాని హామీ.. రెండే శ్లాబులు : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో నూతన తరం సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబుల విధానానికి స్వస్తి పలికి, వాటిని కేవలం రెండే శ్లాబులకు (బహుశా 5%, 18%) కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే, అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఏవి చౌక… జాబితా ఇదే : కొత్త విధానంలో పన్ను రేట్లు తగ్గడం వల్ల అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా, ప్రస్తుతం 12%, 28% శ్లాబులలో ఉన్న వస్తువులు తక్కువ పన్ను శ్లాబుల్లోకి మారనున్నాయి.
12% నుంచి 5% శ్లాబులోకి: ఈ మార్పు వల్ల టూత్‌పేస్ట్, గొడుగులు, కుట్టుమిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, సైకిళ్లు, రూ.1,000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పనిముట్లు వంటి నిత్యావసర, గృహోపకరణాల ధరలు తగ్గుతాయి.
మొబైల్స్, కంప్యూటర్లు: డిజిటల్ యుగంలో నిత్యావసరాలుగా మారిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, నోట్‌బుక్స్ వంటి స్టేషనరీ వస్తువులను కూడా తక్కువ పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.
28% నుంచి 18% శ్లాబులోకి: ఇదే అతిపెద్ద ఊరట. ప్రస్తుతం విలాసవంతమైన వస్తువులుగా పరిగణిస్తున్న టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, సిమెంట్ వంటి నిర్మాణ రంగ ఉత్పత్తులు ఈ జాబితాలోకి రానున్నాయి.
కార్లు, బైక్‌ల ధరలు పది శాతం తగ్గొచ్చు : అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం వాహనాల ధరలు. ప్రస్తుతం కార్లు, బైక్‌లపై 28% జీఎస్టీతో పాటు అదనంగా సెస్ విధిస్తున్నారు. కొత్త సంస్కరణల్లో 28% శ్లాబును తొలగిస్తే, ఇవి నేరుగా 18% శ్లాబు పరిధిలోకి వస్తాయి. దీనివల్ల వాహనాల ధరలు కనీసం 10% తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెట్రోల్, మద్యం మాటేమిటి : జీఎస్టీ సంస్కరణల వార్త రాగానే అందరి మదిలో మెదిలే ప్రశ్న పెట్రోల్, మద్యం గురించే. అయితే, ప్రస్తుతానికి ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి, దానికి మరింత సమయం పట్టవచ్చు. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో కూడా రాష్ట్రాల అంగీకారం కీలకం కానుంది.
‘పాపపు వస్తువుల’పై బాదుడు : సామాన్యుడికి ఊరటనిస్తూనే, కొన్ని హానికరమైన వస్తువులపై ప్రభుత్వం పన్నుల మోత మోగించనుంది. పొగాకు ఉత్పత్తుల వంటి ఐదు నుంచి ఏడు వస్తువులపై 40% వరకు జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే వీటిపై భారీగా సెస్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.


