Saturday, November 15, 2025
Homeబిజినెస్Hatchbacks sales down: చిన్న కార్లను కొనడం మానేసిన జనాలు.. కారణం ఇదే!

Hatchbacks sales down: చిన్న కార్లను కొనడం మానేసిన జనాలు.. కారణం ఇదే!

ఒకప్పుడు జనాలు కారు కొనాలంటే కేవలం సీటింగ్‌ మరియు ధరను మాత్రమే చూసేవారు. వీరిలో ఎక్కువగా మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీలు చిన్నసైజు కార్లను (హ్యాచ్‌బ్యాక్స్‌) మాత్రమే ఎంచుకునేవారు. అయితే కాలం మారిన కొద్ది జనాలు ఎక్కువగా కంఫర్ట్‌కి అలవాటై పోయారు. దీంతో చిన్న కార్లు కొనే జనాలు ఎస్‌యూవీలను ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం రూ.5 లక్షల లోపు ధర కలిగిన ఎంట్రీ లెవల్ కార్లకు మంచి గిరాకీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనాలు కేవలం వీటిని సెకండరీ ఆప్షన్‌ కింద కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల వీటి సేల్స్‌ అమాంత పడిపోతున్నాయి.

వాస్తవ లెక్కల ప్రకారం 2016 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల యూనిట్ల హ్యాచ్‌బ్యాక్స్‌ అమ్ముడవగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 25,402 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. అంటే ఏ స్థాయిలో సేల్స్‌ పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. 2020లో హ్యాచ్‌బ్యాక్స్‌ వాటా 47 శాతం ఉండగా.. 2024 నాటికి అది దాదాపు 24 శాతానికి పడిపోయింది. ఈ పతనం కారణంగా భారతదేశంలో అతిపెద్ద కార్ల మార్కెట్‌ కలిగిన మారుతి సుజుకి సంస్థ హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు 2020 దారుణంగా పడిపోయాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో (ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో) అమ్మకాలు మే నెలలో 31.5 శాతం క్షీణతను చవిచూశాయి. గత సంవత్సరం నుంచి చూసుకుంటే 9,902 యూనిట్ల నుంచి 6,776 యూనిట్లకు సేల్స్‌ పడిపోయాయి.

ఇక రెండవ అతిపెద్ద చిన్న కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియాలో హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2020 లో 192,080 యూనిట్లుగా ఉన్న సంఖ్య 2024 లో 124,082 యూనిట్లకు పడిపోయాయి. ఇది వాహన తయారీదారి సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మళ్లీ ఈ విభాగం వృద్ధికి ఆజ్యం పోసుకోవాలంటే ఈ పొట్టి కార్లలోనూ మంచి సేఫ్టీ ఒక్కటే మార్గం అని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఈ కార్ల కొనుగోలుని ప్రోత్సాహించడం ద్వారా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలను సైతం టార్గెట్‌ చేయవచ్చు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు.

కారు కొనలేని కస్టమర్ ద్విచక్రవాహనం వైపు మరలే అవకాశం ఉంటుంది. కావున ఫోర్ వీలర్‌కి మారేందుకు వీలుగా కొన్ని ప్రోత్సాహకాలు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. 2024 లో మారుతి సుజుకి మొత్తం కార్ల అమ్మకాలలో హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాలు 40 శాతం ఉన్నాయని.. 2018 వరకు కూడా ఈ విభాగం సేల్స్‌లో భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టేదని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. కానీ ఇప్పుడు కార్ల మార్కెట్లో పెద్ద కార్ల వినియోగం పెరగడం వల్ల ఈ సెగ్మెంట్‌ తగ్గిపోయిందని పేర్కొన్నారు. అన్ని విభాగాలు అభివృద్ధి చెందినప్పుడే ఆటోమొబైల్ రంగం దూసుకెళ్తుందని ఆయన వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమీ చేయకపోతే చిన్న కార్ల అమ్మకాలు క్షీణిస్తూనే ఉంటాయని అన్నారు. చివరికి కార్ల తయారీదారుల కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad