First tesla electric car in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కారు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది. కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ ల్యాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ కోడూరు ఈ కారును కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.
డాక్టర్ ప్రవీణ్ కోడూరు ఈ టెస్లా మోడల్ వై కారును ముంబైలోని టెస్లా షోరూమ్ నుంచి కొనుగోలు చేశారు. మన దేశంలో రోడ్డెక్కిన ఆరో టెస్లా కారు ఇది. గత నెలలో ముంబైలో డెలివరీ తీసుకున్న ఆయన, కారును నడుపుకుంటూ హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో ఆయన పుణె, షోలాపూర్‌లలో ఛార్జింగ్ తీసుకున్నట్టు తెలిపారు. సుమారు 770 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు చెప్పారు.
టెస్లా కార్లు అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన పనితీరు మరియు ఎక్కువ శ్రేణి సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం తీసుకుంటున్న ఈవీ పాలసీ నేపథ్యంలో, టెస్లా వంటి కార్ల రాక శుభపరిణామమని డాక్టర్ ప్రవీణ్ అన్నారు.
అయితే, ఆయన ఒక ముఖ్యమైన సమస్యను కూడా లేవనెత్తారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలపై పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ, ఈ కారును వేరే రాష్ట్రంలో కొనుగోలు చేయడం వలన 22 శాతం అధిక పన్ను చెల్లించాల్సి వచ్చిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కారు అసలు ధర సుమారు రూ. 63 లక్షలు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేసిన కారణంగా పన్నుల భారం పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో కూడా టెస్లా షోరూమ్‌ను ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రజలపై ఈ అదనపు పన్ను భారం పడదని, ఎక్కువ మంది టెస్లా కార్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.


