Vehicle Sales: ఆంధ్రప్రదేశ్‌లోని వాహన కొనుగోలుదారులకు ఇది నిజంగా తీపి కబురు. రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలు వాహన మార్కెట్‌కు భారీ ఊతమిచ్చాయి. పన్ను భారం తగ్గడంతో పాటు, ప్రస్తుతం నడుస్తున్న దసరా పండుగ సీజన్ కలిసి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జీఎస్టీ తగ్గుదల అమల్లోకి రావడంతో వినియోగదారులకు కొత్త వాహనాలపై ఖర్చు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.సెప్టెంబర్ 22 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఇందులో ద్విచక్ర వాహనాలు (2,352), కార్ల/క్యాబ్‌లు (241), మరియు ఆటోలు (277) ప్రధానంగా ఉన్నాయి.
ఆ మరుసటి రోజు మంగళవారం 3,500 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఈ సంఖ్యలు చూస్తే జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. గురు, శుక్రవారాల్లో ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ స్పందన: రోజుకు 4,000 రిజిస్ట్రేషన్లు లక్ష్యం
వాహనాల అమ్మకాల పెరుగుదలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గడంతో వాహనాలపై పన్ను భారం తగ్గింది. దీని వల్ల ప్రజలు ఉత్సాహంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. త్వరలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందన్న అంచనాతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.పండుగ ఆఫర్‌లు, తగ్గిన పన్ను కలిసి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల కొనుగోలు వేగం పుంజుకుంది.


