FASTag KYV new rules : దేశవ్యాప్తంగా కోట్లాది ఫాస్టాగ్ వినియోగదారులకు ఇది శుభవార్తే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియలో కీలక మార్పులు చేసి, వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇకపై క్లిష్టమైన నిబంధనలకు చెక్ పెడుతూ, ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఫాస్టాగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ నూతన మార్గదర్శకాలతో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ఇంతకీ ఆ కొత్త నిబంధనలు ఏమిటి? వాటి వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వినియోగదారులకు ఊరటనిచ్చే మార్పులివే:
1. గడువుతో ఊరట.. ఆగని సేవలు : ఇప్పటివరకు KYV ప్రక్రియ పూర్తి చేయని వారి ఫాస్టాగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయని ఆందోళన ఉండేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, సేవలను వెంటనే నిలిపివేయకుండా, KYV పూర్తి చేయడానికి వినియోగదారులకు కొంత సమయం ఇస్తారు. ఈలోగా ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకుల నుంచి SMS ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేస్తారు. ఇది వాహనదారులకు భారీ ఊరటనిచ్చే అంశం.
2. ఫోటో అప్‌లోడ్ ఇక చాలా సులువు : గతంలో KYV కోసం వాహనం ముందు భాగం, పక్క భాగం ఫోటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. ఈ నిబంధనను NHAI సరళతరం చేసింది. ఇకపై కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాహనాలకు సైడ్ ఫోటోలు అవసరం లేదు. కేవలం నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ స్పష్టంగా కనిపించేలా వాహనం ముందు వైపు చిత్రాన్ని అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
3. ‘వాహన్’ పోర్టల్‌తో ఆటోమేటిక్ వివరాలు : వినియోగదారుల శ్రమను తగ్గించేందుకు, KYV ప్రక్రియను ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానించారు. ఇకపై వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయాల్సిన పనిలేదు. వాహనం నంబర్ లేదా ఛాసిస్ నంబర్ ఎంటర్ చేయగానే, వివరాలు ఆటోమేటిక్‌గా స్వీకరించబడతాయి. అంతేకాకుండా, ఒకే మొబైల్ నంబర్‌పై ఒకటి కంటే ఎక్కువ వాహనాలు రిజిస్టర్ అయి ఉంటే, ఏ వాహనానికి KYV పూర్తి చేయాలో ఎంచుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించారు.
4. పాత ఫాస్టాగ్‌లు యథాతథం : KYV విధానం అమల్లోకి రాకముందు జారీ చేసిన ఫాస్టాగ్‌లు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, వాటి దుర్వినియోగంపై ఫిర్యాదులు అందిన పక్షంలో చర్యలు తీసుకుంటారు. ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ట్యాగ్‌లు యాక్టివ్‌గానే ఉంటాయి.
కేవైవీ ఎందుకు తప్పనిసరి : సరైన వాహనానికి, సరైన నంబర్‌తో ఫాస్టాగ్ జారీ చేశారా లేదా అని నిర్ధారించుకోవడానికే ఈ కేవైవీ ప్రక్రియను తప్పనిసరి చేశారు. వాహనం విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ సరిగ్గా అంటించారా లేదా అన్నది కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఒకసారి కేవైవీ పూర్తి చేస్తే, దాని వ్యాలిడిటీ మూడేళ్లు ఉంటుంది. గడువు ముగిశాక రీ-కేవైవీ చేసుకోవాల్సి ఉంటుంది.
సమస్యలు వస్తే.. ఒకవేళ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకు సిబ్బంది వెంటనే మిమ్మల్ని సంప్రదించి సహాయం అందిస్తారు. కేవైవీ సంబంధిత ఫిర్యాదుల కోసం జాతీయ రహదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1033కు కాల్ చేయవచ్చు.


