Credit Card Rent Payments: క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ప్రతి నెలా అద్దె చెల్లించేవారికి షాకింగ్ న్యూస్.. ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లైన ఫోన్ పే, పేటీఎం, క్రెడ్ వంటివి ఇకపై క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రెంట్ చెల్లించే సేవను నిలిపివేశాయి. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేమెంట్ యాప్‌లు తెలిపాయి. దీని ద్వారా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా సులభంగా అద్దె చెల్లించే లక్షలాది మంది అద్దెదారులకు ఇబ్బందులు తప్పవు.
ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు కేవలం అధికారికంగా నమోదు చేసుకున్న వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయాలి. అయితే చాలామంది ఇంటి యజమానులు వ్యాపారులుగా నమోదు చేసుకోలేదు. ఈ కారణంగా ఫిన్‌టెక్ యాప్‌లు వారికి క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు సేవను అందించలేవు.
Also Read: https://teluguprabha.net/business/tata-altroz-gets-5-star-rating/
అంతేకాకుండా KYC నిబంధనల విషయంలోనూ ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. చాలామంది ఈ అద్దె చెల్లింపులను ఉపయోగించుకుని, డబ్బును దగ్గరి బంధువుల ఖాతాలకు బదిలీ చేసి, ఇతర అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించింది. ఇది పూర్తి స్థాయి ధృవీకరణ ప్రక్రియ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడిందని ఆర్‌బీఐ భావించింది.
గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించే పద్ధతి బాగా పాపులర్ అయ్యింది. ప్రతి నెలా పెద్ద మొత్తంలో అద్దె చెల్లించడం వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. అంతేకాకుండా వడ్డీ లేకుండా అద్దె చెల్లింపులకు కొంత కాలం గడువు కూడా లభిస్తోంది. ఇంకా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా చెల్లింపులు సులభంగా, అవాంతరాలు లేకుండా ఉండటంతో ఈ విధానం ట్రెండ్ అయింది.
Also Read: https://teluguprabha.net/business/how-much-to-invest-in-mutual-fund-sip-for-getting-one-crore/
కాగా, ఆర్బీఐ నిబంధనలకు ముందే.. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అద్దె చెల్లింపులపై 1శాతం ఛార్జీని వసూలు చేస్తుండగా.. ICICI, SBI బ్యాంక్స్ కూడా ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్లను ఆపేశాయి. మార్చి 2024 నుంచి చాలా ఫిన్‌టెక్ కంపెనీలు ఈ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ తర్వాత కొన్నింటిని మళ్లీ ప్రవేశపెట్టాయి. ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిబంధనలతో ఈ సేవ పూర్తిగా నిలిచిపోయినట్లే. ఆర్బీఐ కొత్త రూల్స్ ద్వారా పట్టణాల్లో నివసించే లక్షలాది మంది అద్దెదారులకు ఇబ్బందిగా మారాయి. ఇప్పుడు వారు నేరుగా బ్యాంక్ ట్రాన్స్‌ఫ్, యూపీఐ లేదా సాంప్రదాయ పద్ధతుల ద్వారా అద్దె చెల్లించాల్సిందే.


