Bullet: బైక్ లవర్స్‌కు అత్యంత ఇష్టమైన బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇటలీలోని ప్రతిష్టాత్మక EICMA 2025 మోటార్ షో వేదికగా సంచలనం సృష్టించింది. తమ ఐకానిక్ ‘బుల్లెట్’ శ్రేణిలో అత్యంత శక్తిమంతమైన మోడల్ అయిన బుల్లెట్ 650ని ప్రపంచానికి పరిచయం చేసింది. 650సీసీ విభాగంలో ఇప్పటికే ఉన్న ఇంటర్‌సెప్టార్, క్లాసిక్ 650 వంటి విజయవంతమైన మోడల్స్‌కు ఇది నూతన పవర్ హౌస్‌గా చేరనుంది.
పాత అందం, పదునైన శక్తి
కొత్త బుల్లెట్ 650లో కంపెనీ పాత బుల్లెట్ యొక్క వారసత్వ డిజైన్‌ను చెక్కుచెదరకుండా ఉంచింది. చేతితో గీసిన అద్భుతమైన పిన్‌స్ట్రైప్స్, 3D వింగ్డ్ బ్యాడ్జ్‌లు, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ వంటి క్లాసిక్ లుక్స్ యువతను ఆకట్టుకోనున్నాయి. అయితే, ఫీచర్ల విషయంలో మాత్రం ఆధునికతను జోడించింది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజి-అనలాగ్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.
దీని గుండెకాయ 648సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్. ఇది 46.4 bhp శక్తిని, 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బుల్లెట్, సుదూర ప్రయాణాలకు శక్తివంతమైన తోడుగా నిలవనుంది. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS) స్టాండర్డ్‌గా ఇచ్చారు.
ధర
ఈ బైక్‌ను ‘కానన్ బ్లాక్’, ‘బ్యాటిల్‌షిప్ బ్లూ’ రంగులలో విడుదల చేశారు. తొలుత అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించి, ఆ తర్వాత 2026 ప్రథమార్థంలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. మన దేశంలో దీని ధర ₹3.4 లక్షల నుంచి ₹3.7 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. బైక్ ప్రేమికులు నవంబర్ 21న గోవాలో జరగబోయే మోటోవర్స్ 2025 ఈవెంట్‌లో దీన్ని దగ్గరగా చూసే అవకాశం ఉంది.


