Donald Trump Gold Tariffs : బంగారం దిగుమతులపై సుంకాలు విధిస్తారన్న వదంతులతో కొన్ని రోజులుగా అగ్గిమీద గుగ్గిలంలా ఉడికిపోతున్న అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌కు ఒక్కసారిగా చల్లని కబురు అందింది. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి, పసిడిపై ఎలాంటి సుంకాలూ ఉండబోవని తేల్చిచెప్పడంతో పెట్టుబడిదారుల గుండెల్లో రాయి పడింది. సోమవారం ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి.
వదంతే నిప్పు రాజేసింది : గత కొన్ని రోజులుగా అమెరికా వాణిజ్య వర్గాల్లో బంగారం దిగుమతులపై సుంకాలు విధిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ కేంద్రమైన స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయ్యే 1 కేజీ, 100 ఔన్సుల గోల్డ్ బార్‌లపై 39% వరకు కస్టమ్స్ సుంకాలు విధించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) జూలై 31న ఓ స్విస్ రిఫైనర్‌కు రాసిన లేఖ కలకలం రేపింది. ఈ లేఖ బయటకు పొక్కడంతో ప్రపంచ బులియన్ మార్కెట్ సరఫరా గొలుసు దెబ్బతింటుందన్న భయంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు.
ఈ గందరగోళం ఫలితంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ‘కామెక్స్’లో శుక్రవారం (ఆగస్టు 8న) డిసెంబరు నెల గోల్డ్ డెలివరీ ధర రికార్డు స్థాయికి ఎగబాకింది. ఫ్యూచర్స్ ధర ఏకంగా ఔన్సుకు 3,534 డాలర్ల ఆల్‌టైమ్ ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
తెరదించిన ట్రంప్ ప్రకటన : మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అనిశ్చితికి తెరదించుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో కీలక ప్రకటన చేశారు. “బంగారంపై సుంకాలు ఉండవు!” (“Gold will not be Tariffed!”) అని ఆయన చేసిన ఒక్క పోస్ట్ మార్కెట్ గతిని మార్చేసింది. ఈ విషయంపై నెలకొన్న తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దేందుకు త్వరలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తామని వైట్‌హౌస్ వర్గాలు కూడా అంతకుముందే సంకేతాలిచ్చాయి.
కుప్పకూలిన ధరలు : ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే బంగారం ధరలు శరవేగంగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్: అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర సోమవారం ట్రేడింగ్‌లో 2.4% పతనమై ఔన్సుకు 3,407 డాలర్లకు దిగివచ్చింది. స్పాట్ బంగారం ధర సైతం 1.2% తగ్గి 3,357 డాలర్ల వద్ద స్థిరపడింది.
భారత మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర భారీగా తగ్గింది. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,000 వరకు పతనమైంది.
మైనింగ్ షేర్లపై ప్రభావం: ఈ ప్రకటనతో బ్యారిక్ మైనింగ్, న్యూమోంట్ వంటి దిగ్గజ గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్ల ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
ట్రంప్ జోక్యంతో పసిడిపై సుంకాల గండం గడిచిందని, ఇది ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికి శుభసూచకమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, దీనిపై అధికారికంగా, కచ్చితమైన కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని స్విస్ అసోసియేషన్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ట్రేడర్స్ అభిప్రాయపడింది.


