UPI P2P Collect Request Ban : మీరు ఫోన్ పే – గూగుల్ పే లేదా మరేదైనా యూపీఐ యాప్‌ను రోజూ వాడుతున్నారా..? అయితే, ఈ వార్త మీకోసమే..! అక్టోబరు 1, 2025 నుంచి మీరు తరచూ ఉపయోగించే ఒక కీలకమైన ఫీచర్ శాశ్వతంగా కనుమరుగు కాబోతోంది. మన లావాదేవీలను సులభతరం చేసిన ఈ సదుపాయాన్ని ఉన్నపళంగా ఎందుకు తొలగిస్తున్నారు..? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి..? ఈ మార్పు మీ డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే, అన్ని యూపీఐ యాప్‌ల నుంచి ‘పర్సన్ టు పర్సన్’ (P2P) కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్‌ను శాశ్వతంగా తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
మోసాల మాయాజాలం: ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ ద్వారా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి డబ్బు చెల్లించమని అభ్యర్థన పంపవచ్చు. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, సైబర్ నేరగాళ్లకు ఒక వజ్రాయుధంగా మారింది. ప్రభుత్వ పథకాల పేరుతో, బంధువులు లేదా స్నేహితుల ముసుగులో అమాయక ప్రజలకు ఫేక్ ‘కలెక్ట్ రిక్వెస్ట్‌లు’ పంపిస్తున్నారు.
అమాయకులే లక్ష్యం: చాలామంది వినియోగదారులు, ఇది డబ్బు స్వీకరించే ప్రక్రియ అని పొరబడి ‘యాక్సెప్ట్’ బటన్‌పై క్లిక్ చేసి, తమ యూపీఐ పిన్ నంబర్‌ను ఎంటర్ చేస్తున్నారు. ఆ మరుక్షణమే వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఇలాంటి మోసాలతో ఎంతోమంది పర్సుకు చిల్లు పడింది.
ఫిర్యాదుల వెల్లువ: ఈ తరహా మోసాలపై బ్యాంకులకు, యూపీఐ యాప్‌లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో NPCI మొదట ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ద్వారా పంపగల గరిష్ఠ పరిమితిని రూ. 2,000కి తగ్గించింది. దీనివల్ల మోసాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది. అందులో భాగంగానే ఈ ఫీచర్‌కే మంగళం పాడాలని నిర్ణయించింది.
సామాన్యులపై ప్రభావం ఎంత : అక్టోబరు 1 నుంచి రాబోయే ఈ మార్పు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
‘కలెక్ట్ రిక్వెస్ట్’ బంద్: ఇకపై మీరు స్నేహితులు లేదా బంధువుల నుంచి డబ్బులు అడగటానికి ‘కలెక్ట్ రిక్వెస్ట్’ పంపలేరు. అలాగే, ఇతరులు పంపిన రిక్వెస్ట్‌లను మీరు స్వీకరించలేరు.
డబ్బు పంపడంలో మార్పు లేదు: మీరు ఇతరులకు డబ్బు పంపే ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. ఎప్పటిలాగే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా ఫోన్ నంబర్‌కు నేరుగా డబ్బులు పంపవచ్చు.
వ్యాపారులకు వర్తించదు: ఈ నిబంధన కేవలం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు (P2P) మాత్రమే వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో వంటి వ్యాపార సంస్థలు (మర్చంట్లు) తమ కస్టమర్లకు పేమెంట్ రిక్వెస్ట్‌లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్‌లను ఆమోదించి, యూపీఐ పిన్ ఎంటర్ చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
సంఖ్యలు చెబుతున్న నిజాలు : ఈ ‘P2P కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ ఎంత విస్తృతంగా దుర్వినియోగం అవుతుందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 జులై నెలలోనే ఏకంగా 1940 కోట్ల P2P పేమెంట్ రిక్వెస్టులు రాగా, వాటిలో కేవలం 700 కోట్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇది 2024 జులైలో వచ్చిన 1400 కోట్ల రిక్వెస్టులతో పోలిస్తే దాదాపు 500 కోట్లు అధికం. ఈ గణాంకాలు మోసపూరిత రిక్వెస్టుల పెరుగుదలను సూచిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 40 కోట్ల మంది యూపీఐ వినియోగదారులు ఉండగా, ప్రతినెలా సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువైన 2వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతే లక్ష్యంగా NPCI ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.


