India-Venezuela economic cooperation : ప్రపంచ పటంలో చమురు నిక్షేపాలకు చిరునామాగా నిలిచే వెనిజులా, ఇప్పుడు తన దృష్టిని కీలక ఖనిజాల వైపు మళ్లిస్తోంది. కేవలం ముడి చమురుకే పరిమితం కాకుండా, ఆర్థిక బంధాన్ని విస్తృతం చేసుకునేందుకు భారత్ వైపు ఆశగా చూస్తోంది. ఈ మేరకు విశాఖ సాగర తీరంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తమ ఆసక్తిని స్పష్టం చేసింది. దశాబ్దకాలంగా నిద్రాణంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మళ్లీ జీవం పోసే ఈ ప్రయత్నం వెనుక ఉన్న వ్యూహమేంటి? ఈ కొత్త బంధంతో ఇరు దేశాలకు కలిగే ప్రయోజనాలేంటి?
విశాఖలో కీలక భేటీ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వెనిజులా పర్యావరణ మైనింగ్ అభివృద్ధి శాఖ మంత్రి హెక్టర్ సిల్వాలతో విశాఖపట్నంలో శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో వెనిజులా ప్రతినిధి బృందం, చమురు రంగానికి ఆవల భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని, ముఖ్యంగా కీలక ఖనిజాల రంగంలో సహకరించుకోవాలని, భారత పెట్టుబడులను ఆకర్షించాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సంయుక్త కమిటీకి పునరుజ్జీవం: మంత్రి గోయల్ : ఈ ప్రతిపాదనపై మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. పదేళ్ల క్రితం చివరిసారిగా సమావేశమైన ‘భారత్-వెనిజులా సంయుక్త కమిటీ’ యంత్రాంగాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పటికే వెనిజులాలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనిని మైనింగ్, అన్వేషణ రంగాల్లో మరింత లోతైన సహకారానికి పునాదిగా వాడుకోవచ్చని ఆయన సూచించారు. అంతేకాకుండా, ఔషధ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు ‘ఇండియన్ ఫార్మకోపియా’ను ఆమోదించాలని, ఆటోమొబైల్ రంగంలో సహకారానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ వెనిజులాకు సూచించారు.
ఏపీ లాజిస్టిక్స్‌కు డిజిటల్ జోష్ : ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో లాజిస్టిక్స్ వ్యవస్థను డిజిటలైజ్ చేసేందుకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్ (ULIP) సహాయంతో ఒక సమీకృత డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములందరూ లాజిస్టిక్స్ కార్యకలాపాలు, పనితీరును నిజ సమయంలో పర్యవేక్షించవచ్చు. ఇది సమన్వయాన్ని మెరుగుపరిచి, సామర్థ్యాన్ని పెంచి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది.


