Saturday, November 15, 2025
HomeTop StoriesJobs: ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి సన్నాహాలు

Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి సన్నాహాలు

Po jobs in State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో భారీగా ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.

- Advertisement -

ఈ నియామక ప్రక్రియపై ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ పోలుదాసు వివరాలు వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది జూన్ నాటికి 505 పీవో పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

18,000 పోస్టుల భర్తీ లక్ష్యం:

ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గతంలోనే ప్రకటించిన విధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు అవసరాలకు అనుగుణంగా ఆఫీసర్లు, క్లరికల్ కేడర్‌లలో కలిపి మొత్తం 18,000 పోస్టులను భర్తీ చేయాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ప్రకటించిన 3,500 పీవో పోస్టుల నియామకాలు ఈ బృహత్ ప్రణాళికలో భాగమే.

ఐటీ విభాగం బలోపేతం:

మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఎస్‌బీఐ తమ ఐటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,300 మంది నిపుణులను నియమించుకుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా బ్యాంకు సేవలను దేశ ప్రజలకు మరింత చేరువ చేయాలని, మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ నియామక ప్రక్రియ నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.

ఎస్‌బీఐలో పీవోగా ఎంపికైన వారికి ప్రారంభంలోనే మంచి జీతం లభిస్తుంది.

ప్రస్తుతం, ఎస్‌బీఐ పీవోలకు అలవెన్సులు, ఇతర సదుపాయాలతో కలిపి నెలకు సుమారుగా రూ. 84,000 నుండి రూ. 85,000 వరకు జీతం లభించే అవకాశం ఉంది. బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటి వివిధ అలవెన్సులు వీటికి అదనంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad