Telangana Health Department recruitment : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా తెలంగాణ సర్కారు కీలక ముందడుగు వేసింది. వైద్యుల కొరతను నివారించి, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారీ నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని నిరుద్యోగ వైద్యులకు తీపి కబురు అందిస్తూ, ఏకంగా 1623 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఇంతకీ, ఏయే విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి..? దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది..? ఎంపిక విధానంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు?
రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో నెలకొన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని ఆసుపత్రులతో పాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీల భర్తీకి తాజాగా నియామక ప్రకటన జారీ చేసింది.
భారీగా పోస్టుల భర్తీ.. వివరాలు : మొత్తం 1623 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో సింహభాగం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (TVVP): 1616 పోస్టులు,
ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్యులు: 7 పోస్టులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జోన్ల వారీగా ఖాళీల కేటాయింపు : రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా, జోనల్ విధానంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
మల్టీజోన్ 1: 858 ఖాళీలు
మల్టీజోన్ 2: 765 ఖాళీలు
కాంట్రాక్టు వైద్యులకు ప్రత్యేక ప్రాధాన్యం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వైద్యులకు ఈ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ప్రత్యేక వెయిటేజీ కల్పించింది. వారి సేవలను గుర్తిస్తూ, ఎంపిక ప్రక్రియలో వారికి 20 పాయింట్లు కేటాయించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది కాంట్రాక్టు వైద్యులకు భారీ ఊరటనిచ్చే అంశం.
ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ తేదీలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుల ప్రారంభం: వచ్చే నెల (సెప్టెంబర్) 8వ తేదీ
దరఖాస్తుల ముగింపు: అక్టోబర్ 22వ తేదీ
విభాగాల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలని అధికారులు సూచించారు.


