Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTollywood: సినీ ఇండస్ట్రీ సమస్యలపై 30మందితో కమిటీ

Tollywood: సినీ ఇండస్ట్రీ సమస్యలపై 30మందితో కమిటీ


తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారం కొరకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తం 30 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్(Bharat Bhushan)ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు.

ఇటీవల థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇండస్ట్రీ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్యైనా, విజ్ఞప్తైనా వ్యక్తిగతంగా కాకుండా… కేవలం అధికారిక సినీ అసోసియేషన్ల ద్వారానే మాట్లాడాలని పవన్ తేల్చి చెప్పేశారు. పన్నులు, థియేటర్ల ఆదాయం, టికెట్ రేట్లు, మల్టీప్లెక్స్ వ్యాపారాల్లో ఉన్న లోపాలు, వీటిపై ఏర్పడుతున్న వివాదాలు, పరిశ్రమలో కొనసాగుతున్న గుత్తాధిపత్యం వంటి అంశాలపై సమీక్షలు జరపబోతున్నట్టు ఈ లేఖలో వివరంగా పేర్కొన్నారు.

పవన్ ఆగ్రహంపై సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం విధితమే. పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదని తెలిపారు. సినిమా వాళ్లకు రెండూ ప్రభుత్వాలు చాలా ముఖ్యమని వివరణ ఇచ్చారు. కాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ కు పిలుపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పవన్ సినిమాను ఆపడానికి కొంతమంది కుట్రలు పన్నారంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కూడా ఇండస్ట్రీ పెద్దలపై మండిపడ్డారు. రిట్నర్ గిఫ్ట్ బాగుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీ సమస్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఫిల్మ్ ఛాంబర్ 30 మందితో ఓ కమిటీని నియమించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad