70th Filmfare Awards : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతోన్న 70వ ఫిల్మ్ ఫేర్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ అంతా నగరానికి రావటంతో కోలాహాలంగా మారింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరినీ ఆకర్షించిన విషయం ఈ వేడుకలకు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. వీరు హోస్ట్ చేయటంతో ఫిల్మ్ ఫేర్ మరింత ఆకర్షణీయంగా మారింది.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2025లో మెయిన్ కేటగిరీల్లో ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరు నటులు గెలుచుకున్నారు. ఐ వాంటు టు టాక్ చిత్రానికిగానూ అభిషేక్ బచ్చన్.. చందు ఛాంపియన్ చిత్రానికిగానూ కార్తీక్ ఆర్యన్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డ్‌ను జిగ్రా చిత్రంలో నటనకుగానూ ఆలియా భట్ సొంతం చేసుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో ఆమె అందుకున్న ఆరవ అవార్డ్ ఇది కావటం విశేషం. బాలీవుడ్ నటీమణుల్లో ఆలియా దీంతో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లయ్యింది.
ఇక 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావ్ తెరకెక్కించిన లాపతా లేడీస్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు ఇలా 13 విభాగాల్లో ఈ సినిమా తన మార్క్ చూపించింది. 2020లో విడుదలైన గల్లీ బాయ్స్ చిత్రానికి అప్పట్లో 13 అవార్డులు వచ్చాయి. దానికి సమానంగా ఈ సినిమా కూడా అన్నే అవార్డులను దక్కించుకోవటం విశేషం. లాపతా లేడీస్ చిత్రంలో నటించిన రవి కిషన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ సహాయ నటిగా ఛాయా కదమ్, ఉత్తమ డెబ్యూ నటిగా నితాన్షి గోయెల్, ఉత్తమ స్క్రీన్, డైలాగ్స్ విభాగంలో స్నేహా దేశాయ్, ఉత్తమ మ్యూజిక్, నేపథ్య సంగీతానికిగానూ రామ్ సంపత్, ఉత్తమ గాయకుడిగా అర్జిత్ సింగ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
విమర్శకులు విభాగంలో ఐ వాంట్ టు టాక్ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడుగా రాజ్‌కుమార్ రావ్ నిలిచారు. కిల్ చిత్రం యాక్షన్, సౌండ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో సత్తా చాటింది. దివంగత దర్శకుడు శ్యామ్ బెనగల్ (మరణాంతరం), జీనత్ అమన్‌లకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ వచ్చింది. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే పనిలో భాగంగా ప్రకటించిన ఆర్డీ బర్మన్ అవార్డును జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాలకుగానూ అంచిత్ టక్కర్ సొంతం చేసుకున్నారు.


