Actor Huma Qureshis cousin brother murdered: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన హత్య జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ కజిన్ బ్రదర్, ఆసిఫ్ ఖురేషీ (42 ఏళ్లు) స్కూటర్ పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న వివాదంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/anchor-ravi-sensational-comments-on-bigg-boss/
ఘటన వివరాలు
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ సంఘటన నిజాముద్దీన్ ప్రాంతంలో రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్‌ను అడ్డంగా నిలిపారు. ఇంటికి దారి లేకుండా అడ్డంగా ఉండడంతో.. స్కూటర్‌ను పక్కకు తీయమని ఆసిఫ్ వారిని కోరగా, ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. చిన్న వాదన తీవ్ర ఘర్షణగా మారడంతో, నిందితులు కోపంతో ఆసిఫ్‌పై దాడి చేసి ఆయనను హతమార్చారు.
కుటుంబ సభ్యుల ఆవేదన
హుమా ఖురేషీ తండ్రి, ఆసిఫ్ మేనమామ అయిన సలీమ్ ఖురేషీ, ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. “మా ఇంటి ముందు స్కూటర్ అడ్డంగా పెట్టారు. దారి కోసం పక్కకు తీయమని ఆసిఫ్ కోరాడు. అంతే, ఈ చిన్న విషయానికి వాగ్వాదం జరిగి, ఆ ఇద్దరూ కలిసి నా మేనల్లుడిని చంపేశారు,” అని భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఆసిఫ్ ఖురేషీ స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


