Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మునుపటి షెడ్యూల్ పూర్తయి రెండున్నర నెలలుపైనే గడిచినా, తదుపరి షెడ్యూల్‌పై ఇంతదాకా క్లారిటీ రాలేదు. స్క్రిప్ట్ విషయంలో తారక్ అసంతృప్తిగా ఉన్నాడనీ, అందువల్లే షూటింగ్ నిలిచిపోయిందనీ వదంతులు వ్యాపించినా మేకర్స్ మౌనం వహించారు తప్పితే, ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తోన్న నాజర్‌కు సంబంధించి ఇంతవరకు తీసిన సీన్లు ఆశించిన రీతిలో లేవనీ, వాటిని తిరిగి షూట్ చేయాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నాడనీ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే ఎన్టీఆర్ సూచనల మేరకు స్క్రిప్ట్ సెకండాఫ్‌లోనూ మార్పులు జరిగాయంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నవంబర్ మూడోవారం నుంచి ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ యూరప్‌లో మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి లొకేషన్ల ఎంపిక పూర్తయింది. ఎన్టీఆర్ సహా యూనిట్ అంతా అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: https://teluguprabha.net/cinema-news/prasanth-varma-producers-advance-dispute-tollywood/
2026 జూన్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది దర్శక నిర్మాతలు ఇంతకు ముందు భావించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అది కుదిరే పని కాదని తెలుస్తోంది. కనీసం ఆగస్ట్ 15కైనా సినిమాని రెడీ చేస్తే గొప్పే అన్నట్లు పరిస్థితి ఉంది. ఇప్పటివరకూ ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు తీసినా, వాటన్నింటికీ మించిన బడ్జెట్‌తో ‘డ్రాగన్’ను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ సినిమా కోసం తారక్ తన లుక్స్‌ను మార్చుకుంటున్నాడు. అతని జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది.


