Actress Kasturi| సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరికి షాక్ తగిలింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మధురై హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైంది. పరారీలో ఉన్న ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. గత వారం రోజులుగా కస్తూరి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.
తనపై నమోదైన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయకుండా మందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పినా.. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు నమోదు చేశారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఇటీవల బ్రహ్మణులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కస్తూరి.. తెలుగు జాతి ప్రజలపై వివాదాస్పదనమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలతో పాటు తమిళ సంఘాలు కూడా చెన్నై, మధురై సహా వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేశాయి. దీంతో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కస్తూరి పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.