Keerthy Suresh: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొత్త జర్నీని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్‌రాజు రూపొందించనున్న ఎల్లమ్మ సినిమాలో ఆయన హీరోగా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఖరారైంది. రాక్‌స్టార్ సరసన నటించబోయే కథానాయిక ఎవరో కాదు.. కీర్తి సురేష్. వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకునే కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించనుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
దిల్‌రాజు బ్యానర్‌లో కీర్తి సురేష్ రెండు సినిమాలు చేయటానికి అగ్రిమెంట్ చేసింది. అందులో భాగంగా ఆమె ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రౌడీ జనార్ధన్ సినిమాలో నటించటానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. విజయ్, కీర్తి సురేష్ ఇది వరకు మహానటిలో నటించినప్పటికీ జోడీగా మాత్రం నటించలేదు. ఈ సినిమాలో మాత్రం జోడీ కడుతున్నారు. దీంతో పాటు దిల్ రాజు నిర్మించబోతున్న ఎల్లమ్మ మూవీలో కీర్తి నటించనుంది. బలగం ఫేమ్ వేణు ఎల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌కు ఇది హీరోగా తొలి సినిమానే. అయినప్పటికీ అతనితో కీర్తి సురేష్ నటిస్తుందంటే కారణం.. మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకున్న గుర్తింపే.
ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే.. బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎల్దండి ఈ కథను సిద్ధం చేసుకుని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ముందుగా నానితో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన తప్పుకున్నాడు. తర్వాత నితిన్ రంగంలోకి వచ్చాడు. ఆయన కూడా నో చెప్పటంతో కథ శర్వానంద్ వరకు వెళ్లింది. తను కూడా ఒప్పుకోలేదు. దీంతో దిల్ రాజు అదే కథతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేయటానికి రెడీ అయ్యాడు. అప్పుడెప్పుడో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అవుతాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దేవిశ్రీ తన రూట్ మారుస్తున్నాడు. మరీ జర్నీని ఏ మేరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తాడో చూడాలి మరి.


