Hero Darshan: కన్నడ ప్రముఖ నటి రమ్య (దివ్య స్పందన) గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. అభిమన్యు చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈమె.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమానులు తనను ఆన్‌లైన్‌లో వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సదరు అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తనపై అత్యాచార బెదిరింపులు రావడం దారుణమైన విషయమని అన్నారు.
అసలేం జరిగిందంటే
రేణుకా స్వామి హత్య కేసుపై రమ్య ఇటీవలే ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు దర్శన్ ఫ్యాన్స్.. తనకు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారని నటి తెలిపారు. “రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సింది. నిన్ను అత్యాచారం చేస్తాం. రేణుకా స్వామికి, దర్శన్ ఫ్యాన్స్ కు ఎలాంటి తేడా లేదు. రోజూ పలువురు అభిమానులు.. అత్యాచార బెదిరింపులతో నన్ను వేధిస్తున్నారు. ఆడవాళ్లను వేధించడం వారికి ఓ అలవాటుగా మారిపోయింది. బెంగళూరు పోలీస్ కమీషనర్‌ను కలవబోతున్నా. నా లాయర్లతో ఇప్పటికే దీని గురించి చర్చించాను. ఈ కామెంట్స్ చేసినవారిపై ఫిర్యాదు చేస్తాను” అని రమ్య పేర్కొన్నారు. తనకు పెట్టిన అసభ్యకరమైన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా ఇన్‌స్టా స్టోరీలో రమ్య పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా వారు వేధిస్తున్నారని రమ్య బాధపడ్డారు.
కాగా, గతంలోనూ రమ్య ఇలాంటి వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఇలా వేధింపులకు గురి చేసే వారు తప్పించుకొని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసభ్యకర కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు.


