Thama Release Updates: ఇటు సౌత్.. అటు నార్త్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో మెప్పిస్తోన్న బ్యూటీ ఎవరంటే వెంటనే చెప్పే పేరు రష్మిక మందన్న. దీపావళికి బాలీవుడ్ మూవీతో సందడి చేయటానికి ఈ కన్నడ సోయగం రెడీ అవుతోంది. ఇంతకీ రష్మిక ఏ సినిమాతో దీపావళి ధమాకా ఇవ్వనుంది? సోలో రిలీజ్ ఈ బ్యూటీ డాల్‌కి కలిసొచ్చేనా? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం…
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తోంది. 2022లో ‘గుడ్ బై’ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించిన రష్మికకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందించలేదు. అయినా హిందీలో అవకాశాలు మాత్రం తగ్గలేదు. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమె బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేజిక్కించుకుంటోంది. 2023లో వచ్చిన ‘మిషన్ మజ్ను’ కూడా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం బలపడింది. రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో భారీ హిట్‌ను కొట్టింది. తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా రష్మిక నటనకు, ఆమె కెరీర్‌కు ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘థామా’ లో నటిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా మీద ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ రష్మికకు మళ్లీ బాలీవుడ్‌లో బ్రేక్ ఇవ్వొచ్చని అభిమానులు నమ్ముతున్నారు. చిత్రబృందం ప్రకారం సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఏడాదికి రెండు మూడు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం ఉన్నా రష్మిక మాత్రం కథా బలం ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోందట. కథా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ హిట్‌లు అందుకునే ప్రయత్నంలో ఉంది.
Also Read – SYG – Sambarala Yeti Gattu: గాసిప్స్ సాయి దుర్గ తేజ్ చెక్.. ‘సంబరాల ఏటిగట్టు’ రీ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే!
దీపావళి సమయంలో విడుదలయ్యే హిందీ సినిమాలు సాధారణంగా భారీ వసూళ్లు సాధించడానికి మంచి అవకాశాలు ఉండటంతో బాలీవుడ్ స్టార్‌లు తాము నటించిన చిత్రాన్ని దీపావళికే రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేస్తారు. ఇలాంటి పండగ సీజన్‌ల్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి బరిలోకి దిగడం సహజమే. కానీ 2025 దీపావళి మాత్రం ఆ హంగామాను చూడలేదు. అనేక సినిమాలు షూటింగ్ ఆలస్యం పోస్ట్‌ప్రొడక్షన్ సమస్యలు వంటి కారణాలతో వెనక్కి వెళ్లాయి. దీంతో ఈసారి దీపావళికి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏకైకంగా ఆకట్టుకోబోతున్న చిత్రం ‘థామా’ మాత్రమే. రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం పండుగ రోజున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రంగా కనిపిస్తోంది.
2025 దీపావళికి బాలీవుడ్ బాక్సాఫీస్ మరింత సందడిగా మారుతుందని అందరూ ఊహించారు. కానీ ఆశించినంతగా పరిస్థితులు అనుకూలించలేదు. ప్రధానంగా రిలీజ్ అవుతుందని భావించిన ‘ధురంధర్’ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం క్రిస్మస్‌కి విడుదల కావాల్సిన అవకాశాలు ఉన్నప్పటికీ ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. అంతే కాకుండా భారీ అంచనాల మధ్య రూపొందుతోన్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కూడా దీపావళికి థియేటర్లలోకి రావడం లేదు. దీంతో బాలీవుడ్‌లో దీపావళికి పోటీగా నిలిచే పెద్ద సినిమాలు ఏవీ లేకుండా పోయాయి.
గత కొన్ని బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను మించిపోయిన రష్మిక మందన్నకి ఇది చాలా కీలకమైన మూవీ. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలతో వరుసగా ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు ‘థామా’ హిట్ అయితేనే, ఆమెకు బాలీవుడ్‌లో మళ్ళీ సరైన మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదంటే రాబోయే ప్రాజెక్టుల మీద ఉన్న ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.


