Aishwarya Rai Defamation Suit: ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు, ఫొటోల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. అయితే ఈ ప్రభావం సినీ సెలబ్రిటీలపై మరింత ఎక్కువగా ఉంటూ వ్యక్తిగతంగా సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో, ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీపై బాలీవుడ్ అగ్ర తారలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వేసిన పరువు నష్టం కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.
ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీపై అభిషేక్ బచ్చన్ దంపతులు చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. తమ అనుమతి లేకుండా AI డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా తమ ఫొటోలను, వీడియోలను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తున్నారని వాటిని తొలగించాలని కోరుతూ ఈ జంట మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ యూట్యూబ్ ఆ వీడియోలను తొలగించకపోవడంతో.. ఈ బాలీవుడ్ దంపతులు యూట్యూబ్, దాని మాతృ సంస్థ గూగుల్‌పై ఏకంగా రూ. 4 కోట్లకు భారీ పరువు నష్టం దావా వేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/balayya-dual-role-in-nbk-111/
పరువు నష్టం దావా వేయడంతో యూట్యూబ్ సంస్థ వెంటనే దిగొచ్చింది. దాదాపు 250కి పైగా వీడియో లింక్‌లను తక్షణమే తొలగించడంతో పాటు అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఛానల్స్‌ను బ్లాక్ చేసింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ దంపతుల గౌరవం ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉన్న యూఆర్‌ఎల్‌లను 72 గంటల్లోపు తొలగించి బ్లాక్ చేయడంతో పాటు అలాంటి కంటెంట్ కనిపించకుండా చేయాలని గూగుల్, యూట్యూబ్ సహా అన్ని ప్లాట్‌ఫార్మ్‌ను న్యాయస్థానం కఠినంగా హెచ్చరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్, గూగుల్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/rukmini-vasanth-succsess-story/
కాగా, ఇటీవలే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కూడా ఇలాంటి అంశంపైనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నాగార్జున తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన హక్కులను కాపాడుకోవడానికి కోర్టు ఉత్తర్వులు పొందారు. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో ఈ కేసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


