ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. AA22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన సందర్భంగా అదిరిపోయే వీడియోను రిలీజ్ చేశారు. స్పెడర్‌మాన్, బ్యాట్‌మాన్, అవతార్, రోబో మూవీల తరహాలో కొత్త టెక్నాలజీని వాడుకుని ఈ మూవీ చేయనున్నట్లు హింట్ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. అభిమానుల ఊహలకు అందని రీతిలో ఈ సినిమా ఉండనుందని మేకర్స్ తెలిపారు. హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నాయని పేర్కొన్నారు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తీసిన’జవాన్’ సినిమాతో బ్లాక్‌బాస్టర్ అందుకున్నాడు అట్లీ. ఆ మూవీ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఇండస్ట్రీ హిట్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.