విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తొలి రోజు నుంచే థియేటర్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ చిత్రం ఐదో రోజు వసూళ్లలో రికార్డ్ సృష్టించింది. రూ.12.75 కోట్లు రాబట్టడంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
తొలి స్థానంలో ‘ఆర్‌ఆర్ఆర్’ (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (రూ.12.75కోట్లు) నిలిచింది. ఇక ‘అల వైకుంఠపురం’ (రూ.11.43 కోట్లు), ‘బాహుబలి 2’ (రూ.11.35 కోట్లు), రూ.10.86 కోట్లతో ‘కల్కి 2898 ఏడీ’ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా అక్కడ రెండు మిలియన్ డాలర్లు సాధించినట్లు మూవీ యూనిట్ తెలిపింది. వెంకటేశ్ కెరీర్‌లోనే ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది.