Ghaati Movie: ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఘాటి’ (Ghaati) సెప్టెంబరు 5న విడుదల కానున్న తరుణంలో, ఊహించని వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (T-ANB) అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
బ్యూరో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, సినిమా కథాంశం గంజాయి సాగు, రవాణా, వినియోగం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఈ ట్రైలర్‌లో ఎక్కడా కూడా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను హెచ్చరించేలా ఎలాంటి డిస్‌క్లైమర్ లేదని అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి దృశ్యాలు యువత, ముఖ్యంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా వంటి కార్యకలాపాలను ఏ విధంగానూ ప్రోత్సహించకూడదని బ్యూరో స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నేరపూరిత కుట్రగా పరిగణించబడుతుందని హెచ్చరించింది.
ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, సినిమా యూనిట్‌పై 1985 ఎన్డీపీఎస్ చట్టం (Narcotic Drugs and Psychotropic Substances Act) కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఘాటుగా హెచ్చరించారు. సాధారణంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన కథాంశాలు ఉన్న సినిమాలకు సెన్సార్ బోర్డ్ కొన్ని నిబంధనలు విధిస్తుంది. అయితే, టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల కానున్న తరుణంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నేరుగా ప్రకటన విడుదల చేసి హెచ్చరించడం ఇది మొదటిసారి.
ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ పరిణామాలు చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సెన్సార్ బోర్డ్ అనుమతులు ఉన్నప్పటికీ, ఇలాంటి వివాదాలు సినిమాపై ప్రభావం చూపవచ్చు. ఘాటి చిత్రానికి ఈ అడ్డంకి ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. సినిమా విడుదలకు ముందు ఈ సమస్య పరిష్కారమవుతుందా లేదా చట్టపరమైన చిక్కులు కొనసాగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.


