Dasari Kiran Arrest : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దాసరి కిరణ్ (Dasari kiran). ఈయన్ని ఆర్థిక లావాదేవీల కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక కేసులో విజయవాడ పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని విజయవాడకు తరలించినట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై అభిమానులు, సినీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
అరెస్ట్..కేసు వివరాలు..
విజయవాడ పోలీసుల సమాచారం ప్రకారం నిర్మాత దాసరి కిరణ్ అరెస్టు వెనుక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివసిస్తున్న దాసరి కిరణ్.. తన సమీప బంధువు గాజుల మహేష్ (Gajula Mahesh) దగ్గర అప్పు తీసుకుని చెల్లించలేదు. మహేష్ ఒక ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం మహేష్ వద్ద దాసరి కిరణ్ రూ. 4.5 కోట్లు అప్పుగా తీసుకుని తన డబ్బు తిరిగి ఇవ్వమని మహేష్ పలుమార్లు అడిగినా దాసరి కిరణ్ పట్టించుకోలేదు.
దీంతో రెండు రోజుల క్రితం మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలోని దాసరి కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది మహేష్ దంపతులపై దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి అనంతరం గాజుల మహేష్ తన భార్యతో కలిసి విజయవాడ పటమట పోలీసులకు దాసరి కిరణ్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దాసరి కిరణ్ సినీ జర్నీ..
దాసరి కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. వివాదాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన వంగవీటి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హవీష్ హీరోగా రూపొందిన జీనియస్ సినిమాను కూడా దాసరి కిరణ్ నిర్మించారు. సీరియల్ నటుడు ఆర్కే సాగర్ (RK Sagar) తో సిద్ధార్థ్ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు.
2024 ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ పరిణామాలను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం అనే సినిమాను దాసరి కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కూడా పోలీస్ కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాసరి కిరణ్ ఆర్థిక లావాదేవీల కేసులో అరెస్టు కావడం మరింత సంచలనంగా మారింది. పోలీసులు ఈ కేసులో విచారణ జరిపి పూర్తి వివరాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


