Avatar 2 : దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించింది తక్కువ చిత్రాలే అయినా అవి ప్రేక్షకులకు మదిలో చిరకాలం గుర్తుండి పోతాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ చిత్రం గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రాఫిక్స్‌తో మరో లోకానికి తీసుకువెళ్లాడు. ‘పండోరా’ అంటూ ఓ కొత్త గ్రహాన్ని పరిచయం చేశారు. కొత్త జీవజాతులు, తేలియాడే కొండలు ఇలా ఒక్కటి ఏమిటీ సినిమా మొత్తం ఓ అద్భుతమే. ఇక ఈ చిత్ర సీక్వెల్ కోసం అభిమానులు దాదాపు 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితేనేం తొలి భాగాన్ని మించి ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ అలరిస్తోంది.
160 బాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే 5 వేల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే.. కొన్ని చోట్ల ఈ చిత్ర టికెట్ ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. అవతార్-2 టికెట్ల ధరలు తగ్గాయి.
IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్ టికెట్ ధరను తగ్గించారు. టికెట్ ధర ఇప్పుడు రూ.150కి తగ్గింది. ప్రేక్షకులు ఎక్కువగా త్రీడీ వెర్షన్‌ను చూసేందుకే ఇష్టపడుతుండడంతో టికెట్ ధరలను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారట. తద్వారా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగి వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరీ రానున్న రోజుల్లో ‘అవతార్-2’ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సిందే.