Baahubali The Epic Review: తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చూపించిన సినిమా ఏదైనా ఉందంటే, అది ‘బాహుబలి’ మాత్రమే! ఎస్.ఎస్. రాజమౌళి తీసిన ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి 2 ది కన్‌క్లూజన్’ రెండు సినిమాలనూ కలిపి, ఇప్పుడు కొత్తగా మన ముందుకు తీసుకొచ్చిన వెర్షనే ‘బాహుబలి ది ఎపిక్’.
రెండు సినిమాల కథ మొత్తం దాదాపు ఆరు గంటలు ఉంటుంది. కానీ, ఎక్కడా బోర్ కొట్టకుండా, కథలోని ముఖ్యమైన పాయింట్స్ మిస్ అవ్వకుండా, దీనిని కేవలం 3 గంటల 45 నిమిషాలకు కట్ చేశారు. ఇది పాత సినిమాలను మామూలుగా కలిపి చూపించడం కాదు, కొత్తగా ఎడిట్ చేసి, సినిమా చూస్తున్నప్పుడు ఒకే కథ చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా ఎడిట్ చేశారు.
కథ మనందరికీ తెలిసిందే.
శివుడు (మహేంద్ర బాహుబలి) పెరిగి పెద్దవాడై, తన తల్లిని విడిపించడానికి మాహిస్మతి వెళ్తాడు. అక్కడ తన తండ్రి అమరేంద్ర బాహుబలి గురించి నిజం తెలుసుకుని, భల్లాలదేవుడిని చంపి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడనేది కథ.
కొత్తగా ఏముంది?
రెండు సినిమాలు కలిపి దాదాపు 6 గంటలు ఉంటే, దీన్ని 3 గంటల 45 నిమిషాలకు కట్ చేశారు. తమన్నా లవ్ ట్రాక్ సీన్లు, కొన్ని పాటలు, చిన్న పాత్రల సీన్లు చాలా వరకు తీసేశారు. కట్ చేసినా కథ ఎక్కడా ఆగకుండా, ఒకే ఫ్లోలో, కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా బాగా ఎడిట్ చేశారు.
బిగ్ స్క్రీన్‌పై, 4K క్వాలిటీలో ఈ సినిమాను చూడటం మళ్లీ ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. తెలిసిన కధే అయినా , రాజమౌళి ఎమోషన్స్, యాక్షన్ సీన్లను బాగా కట్ చేసాడు కాబట్టి, ఎక్కడా బోర్ కొట్టదు.
మళ్లీ మళ్లీ చూడాలనిపించే మ్యాజిక్! ప్లస్ పాయింట్స్ !
‘బాహుబలి’ అంటే కేవలం యుద్ధాలు, గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి నటించిన సినిమా! మళ్లీ థియేటర్లో ఈ సినిమాను చూస్తుంటే, పదేళ్ల క్రితం వాళ్లు చేసిన మ్యాజిక్ మళ్లీ కళ్ల ముందు కనిపిస్తుంది.
ప్రభాస్: ఒక వైపు అమరేంద్ర బాహుబలిగా ఎంతో రాజసంతో, నిజాయితితో దయతో కనిపిస్తాడు. ఇంకోవైపు మహేంద్ర బాహుబలిగా తల్లి కోసం పోరాడే ఆవేశాన్ని పీక్స్ లో చూపిస్తాడు. రెండు పాత్రల్లో ప్రభాస్ చూపించిన తేడా, కళ్లలో ఆవేశం, రాజసం… మళ్లీ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి.
రానా దగ్గుబాటి: ఈ సినిమాలో విలన్ ఎంత బలంగా ఉంటే, హీరో అంత ఎలివేట్ అవుతాడు. భల్లాలదేవ పాత్రకు రానా ప్రాణం పోశాడు. ఆయన చూపులో క్రూరత్వం, అధికారం కోసం తపన… మళ్లీ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది, ఆ పాత్రను అంత పవర్ఫుల్‌గా చేశాడు.
రమ్యకృష్ణ: రాజమాత శివగామి పవర్‌ను, ఆ క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్‌ను రమ్యకృష్ణ తప్ప ఇంకెవరూ చేయలేరని మళ్లీ ఒకసారి ప్రూవ్ అవుతుంది. ఆమె తీసుకునే కఠిన నిర్ణయాలు, బిడ్డల మీద చూపించే ప్రేమ… ప్రతీది అద్భుతం.
అనుష్క: ముందు దేవసేన పాత్రలో ఆ హీరోయిజం, గర్వం, ధైర్యం… ఆ తర్వాత బందీగా ఉన్నప్పుడు ఆమె పడే బాధ… ఈ రెండు షేడ్స్‌లో అనుష్క నటన హైలైట్. (మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగి వచ్చాడు) అనుష్క చెప్పే డైలాగ్ మళ్లీ థియేటర్‌లో విజిల్స్ వేయిస్తాయి.
సత్యరాజ్: అమాయకత్వం, విశ్వాసం, బాధ… ఈ మూడు ఎమోషన్స్‌ను పలికించిన కట్టప్ప పాత్ర మళ్లీ చూసినా గుండెను పిండేస్తుంది. ప్రభాస్, సత్యరాజ్ మధ్య వచ్చే ప్రతి ఎమోషనల్ సీన్ మళ్లీ ఒకసారి కంటతడి పెట్టిస్తాయి. ”నువ్వు నా పక్కన ఉన్నంత వరుకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మావా” డైలాగ్ కి ఇప్పుడు కూడా థియేటర్ లో గూస్‌బంప్స్ వస్తున్నాయి అంటే కారణం.. సత్యరాజ్, ప్రభాస్ మధ్య ఉన్న బాండ్ ని ఆడియన్స్ అంతలా ఓన్ చేసేసుకున్నారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే, వీళ్ళందరి పర్‌ఫార్మెన్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో, మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడటం అంటే, ఒక మాస్టర్ పీస్‌ను మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేసినట్లే!


