Tollywood Heroes Bollywwod Movies: ఎన్టీఆర్ వార్ 2 మూవీ కోసం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీతోనే ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నాడు. డెబ్యూ మూవీతోనే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా? లేదా? అన్నది మరో నాలుగు రోజుల్లో తేలనుంది.
ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్‌లో హృతిక్ ధీటుగా స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు ఎన్టీఆర్. అతడి డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో యంగ్ టైగర్ కనిపించిన తీరుకు బాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడా? పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? అన్నది రివీల్ చేయకుండా ఫ్యాన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో వార్ 2 తెరకెక్కుతోంది.
ఫస్ట్ డేనే ఈ మూవీ వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఎన్టీఆర్ కంటే ముందు పలువురు తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్‌లో స్ట్రెయిట్ సినిమాలు చేశారు. చిరంజీవి, నాగార్జున నుంచి రామ్‌చరణ్ వరకు చాలా మంది టాలీవుడ్ స్టార్స్ హిందీ సినిమాల్లో తమ లక్‌ను పరీక్షించుకున్నారు. ఇందులో హిట్ అందుకున్నది ఎవరంటే?
మూడు సినిమాలు…
టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా పేరుతెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి హిందీలో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. ది జెంటిల్‌మెన్‌తో పాటు ప్రతిబంధ్, ఆజ్‌కా గుండారాజ్ సినిమాలతో హిందీలో మెరిశాడు. తెలుగు సినిమాలకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూడు సినిమాలు చిరంజీవికి హిట్టు మాత్రం అందివ్వలేకపోయాయి.
అనారి…
తెలుగులో ఫ్యామిలీ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్ అనారి మూవీతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. చంటి మూవీకి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది. అనారి సక్సెస్‌తో బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా వెంకటేష్ సినిమాలు చేయలేకపోయారు. థక్‌దీర్‌వాలా తర్వాత బాలీవుడ్ సినిమాలకు దూరమయ్యాడు. లాంగ్ గ్యాప్ తర్వాత సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో పూజా హెగ్డే సోదరుడిగా ఓ కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
నాగార్జున హయ్యెస్ట్…
బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు హీరోగా నాగార్జున నిలిచారు. శివ మూవీతో బాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసిన నాగార్జున హీరోగానే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్నాడు. ఖుదాగవా, మిస్టర్ బేచారా, అంగారే, జక్మ్, అగ్నివర్ష, ఎల్‌వోసీ కార్గిల్ తో పాటు బ్రహ్మస్త వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను మెప్పించాడు.
జంజీర్‌తో డిజాస్టర్…
జంజీర్ మూవీతో బాలీవుడ్‌లో పాగా వేయాలన్న మెగా హీరో రామ్‌చరణ్‌కు నిరాశే మిగిలింది. అమితాబ్‌బచ్చన్ బ్లాక్‌బస్టర్ మూవీ జంజీర్‌కు రీమేక్‌గా 2013లో విడుదలైన ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. సంజయ్‌దత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అపూర్వ లకియా దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. జంజీర్ డిజాస్టర్‌తో మళ్లీ బాలీవుడ్ గడప తొక్కలేదు చరణ్.
బేబీ మినహా…
రానా దగ్గుబాటి బాలీవుడ్‌లో డిపార్ట్‌మెంట్, హథీ మేరీ సాథీ, దమ్ మారో దమ్, బేబీతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. బేబీ మినహా మిగిలిన సినిమాలేవి అంతగా ఆడలేదు.సుధీర్ బాబు హిందీలో భాగీ మూవీలో విలన్‌గా నటించాడు. ప్రభాస్ వర్షం మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన భాగిలో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. సందీప్ కిషన్ షోర్ ఇన్ ది సిటీ అనే హిందీ మూవీలో నటించాడు.


