Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ కింగ్డమ్‌లోనూ కథానాయికగా మెరిసింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కూడా భాగ్యశ్రీకి నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ సల్మాన్ కాంతతో, రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు వారాల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది భాగ్యశ్రీ బోర్సే.
1950 కాలం నాటి అమ్మాయిగా…
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన కాంత మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్‌తో కలిసి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ హీరోకు, దర్శకుడికి మధ్య నెలకొన్న ఈగో క్లాషెస్‌తో కాంత మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
కాంత మూవీలో 1950 కాలం నాటి అమ్మాయిగా డిఫరెంట్ రోల్‌లో భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతున్నది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఇందులో భాగ్యశ్రీ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంత మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.
ఆంధ్రా కింగ్ తాలుకా…
రామ్ పోతినేనికి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న రిలీజ్ అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ హీరో అభిమాని జీవితం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ప్రోమోలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలపై భాగ్యశ్రీ బోర్సే భారీగా ఆశలు పెట్టుకుంది. కమర్షియల్ హిట్టు అందుకోవాలనే ఈ ముద్దుగుమ్మ కల ఈ రెండు సినిమాలతో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే.
Also Read – Samvat 2082: సంవత్ 2082.. స్టాక్ మార్కెట్ ట్రెడర్లకు, ఇన్వెస్టర్లకు ఇది ఎందుకు ముఖ్యం..


