Prasanth Varma – Mahakali: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చి చాలా నెలలు గడిచిపోయాయి. దాని తర్వాత ఆయన ఏ సినిమాని తీస్తాడా అని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ‘హనుమాన్’ మూవీతో తనదైన పీవీసీయు (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)ను ఆయన నెలకొల్పారు. ఇప్పుడు ఆ యూనివర్స్‌లో భాగంగా ‘మహాకాళి’ అనే సినిమా రానున్నది. అయితే ఈ సినిమాకి ఆయన దర్శకుడు కాదు, ఒక క్రియేటర్. కథ ఆయనది, దర్శకత్వం మాత్రం వేరొకరిది. ఈ సినిమా ద్వారా పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రాక్షసుల గురువు శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా లుక్‌ను రివీల్ చేసి, ఆశ్చర్యపరచిన మేకర్స్, తాజాగా ‘మహా’ పాత్రధారి భూమి శెట్టి లుక్‌ను రివీల్ చేశారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా భూమి శెట్టి లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ, “సృష్టి గర్భం నుండి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు! భూమి శెట్టిని మహాగా పరిచయం చేస్తున్నాము.” అని రాసుకొచ్చారు. మహాగా భూమి ఫస్ట్ లుక్ అసాధారణంగా కనిపిస్తోంది. నుదురు ఎరుపురంగు, మిగతా ముఖమంతా నలుపురంగుతో తీవ్రమైన చూపులతో ఆమె ఉగ్రరూపం అందరి దృష్టినీ తనమీద తిప్పుకునేలా ఉంది. ఒళ్లంతా బంగారు ఆభరణాలతో ఉన్న ఆమె మహాకాళి అపరావతారంలా భాసిస్తోంది.
భూమి శెట్టి స్వస్థలం కర్ణాటకలోని కుందపుర (సందర్భవశాత్తూ రిషబ్ శెట్టి కూడా కుందపుర తాలూకాలోని కేరడి గ్రామ వాస్తవ్యుడు). సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన ఆమె ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలో సత్యదేవ్ భార్యగా ఆమె ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల కళ్లల్లో మెదలుతూనే ఉంది. శారీరక రంగువల్ల చిన్నతనం నుంచే అవమానాలు ఎదుర్కొన్న అనుభవాల నుంచి ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు.

మహా పాత్ర కోసం ఎంతోమందిని పరిశీలించాక భూమి అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె చూపుల తీక్ష్ణత చూస్తుంటే భూమి చేస్తున్న పాత్ర ఎంత శక్తిమంతమైనదో అర్థమవుతోంది. ఈ పోస్టర్‌తో ‘మహాకాళి’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఈ మూవీని ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.



