Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ ఆదివారం మొదలైంది. ఇప్పటివరకూ 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో తొమ్మిదో సీజన్ షురూ అయింది. ఈసారి ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులతో ఉంటుందని హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు.. రణరంగమే అంటూ ఆట ఆరంభానికి ముందే కంటెస్టెంట్స్‌ని సిద్దం చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు అవకాశాన్ని కల్పిస్తూ.. మొత్తం 13 మంది టాప్ ఫైనలిస్ట్‌లను సెలెక్ట్ చేశారు. వీరిలో ఐదుగురు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి పంపించారు. అయితే గతంలో కంటే భిన్నంగా చేపట్టిన ఈ రణరంగం ఆటలో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగబోతుంది.
బిగ్ బాస్ హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టేశారు. ఈ 15 మంది 15 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేయబోతున్నారు. ఆదివారం నాటి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ ఈవెంట్‌లో ఈ 15 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించారు హోస్ట్ నాగార్జున. సెలబ్రిటీల నుంచి 9 మందిని.. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన ఆరుగురు సామాన్యుల్ని హౌస్‌లోకి పంపించారు. మొత్తం ఈ 15 మంది ఎవరంటే..
1. సీరియల్ నటి తనూజ
సీజన్9లో తొలి కంటెస్టెంట్‌గా బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ‘నీ గురించి 9 మాటల్లో ప్రేక్షకులకు చెప్పు’ అని నాగ్ అడగ్గా, తాను ‘ఫ్యామిలీ గర్ల్స్, ఓవర్ థింకర్, సెన్సిటివ్,మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, బాగా వండుతా, అమాయకత్వం, అనుకుంటే అస్సలు వదిలి పెట్టనితత్వం’ అంటూ చెప్పుకొచ్చింది. హౌస్‌లో మాత్రం అమాయకంగా ఉంటే కుదరదంటూ సరదాగా చెప్పుకొచ్చింది. తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని చెప్పింది. వాళ్లు సంతోషించేలా నడుచుకుంటానని హామీ ఇచ్చింది.

2. నటి ఆశా షైనీ
ఇక ఈ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా నటి ఫ్లోరా షైనీ (ఆశాషైనీ) అడుగు పెట్టారు. ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కెరీర్ తొలినాళ్లలో వరుస అవకాశాలు దక్కించుకున్న తాను, ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వాటిని అధిగమించి మళ్లీ తనని తాను నిరూపించుకున్నానని, బిగ్‌బాస్ వేదికతో మరోసారి నిలబడతానని అన్నారు.

3. కల్యాణ్ పడాల
ఇక సామాన్యుల నుంచి కల్యాణ్ పడాల హౌస్‌లోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్ టీమ్ నిర్వహించిన అగ్ని పరీక్ష దాటుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కల్యాణ్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో అతడు హౌస్‌లోకి అడుగు పెట్టిన మూడో కంటెస్టెంట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

4. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్
ఈ సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా సెలబ్రిటీల నుంచి ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ‘జబర్దస్త్’ షో ద్వారా ఇమ్మాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకులకు సైతం వినోదాన్ని పంచుతానని ఈ సందర్భంగా అన్నారు.

5. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
ఐదో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టారు. తనకు ఈ రియాల్టీషో అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్‌తో ఉంటారని, ‘బిగ్‌బాస్’వంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని తెలిపారు. తనకు ఎలాంటి ఫిల్టర్స్ లేవన్న శ్రష్టి.. ఒక అమ్మాయి అనుకుంటే ఏదైనా చేసేయాలని తాను, కూడా అంతేనని తెలిపారు.

6. హరిత హరీశ్
ఇక అగ్నిపరీక్షలో భాగంగా జ్యూరీ మెంబర్స్‌ను మెప్పించిన హరిత హరీశ్ అలియాస్ మాస్క్ మెన్ బిగ్‌బాస్ సీజన్9లోకి అడుగు పెట్టాడు. జ్యూరీ మెంబర్ అయిన బిందు మాధవి.. ఆయన పేరును ప్రకటించారు. హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ రావడంతో తన కల సాకారమైనట్లు హరీశ్ చెప్పారు. తాను జీవితంలో ఒత్తిడితో ఉన్నప్పుడు ‘బిగ్‌బాస్’ ఎంతో ఊరటనిచ్చిందన్నారు. సీజన్‌లో ఉన్నన్ని రోజులు తాను జుట్టు లేకుండానే ఉంటానని వాగ్దానం చేశారు.

7. బుల్లితెర యాక్టర్ భరణి శంకర్
ఇక ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై అలరించిన భరణి శంకర్ కూడా సీజన్9కు వచ్చారు. అయితే, తనతో ఓ వస్తువు తీసుకొచ్చారు. అదేంటో చూపించాలని బిగ్‌బాస్ కోరడంతో అందుకు భరణి నిరాకరించారు. దానిని హౌస్‌లోకి తీసుకెళ్తానని చెప్పారు. వస్తువులేవీ హౌస్‌లోకి తీసుకెళ్లడం కుదరదని చెప్పడంతో అందుకు భరణి కూడా అంగీకరించలేదు. ఆ వస్తువు ఏంటో చెప్పిన తర్వాతే హౌస్‌లోకి వెళ్లాలని లేకపోతే ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పడంతో భరణి హౌస్‌లోకి అడుగు పెట్టకుండానే బిగ్‌బాస్ సీజన్9 నుంచి వెళ్లిపోయారు. మళ్లీ కాసేపటి తర్వాత బాక్స్‌లో ఉన్న వస్తువు చూపించి హౌస్‌లోకి అడుగు పెట్టారు.

8. జబర్దస్త్ రీతూ చౌదరి
బిగ్‌బాస్ హౌస్‌లోకి బుల్లితెర నటి, యాంకర్ రీతూ చౌదరి అడుగుపెట్టారు. తన అసలు పేరు దివ్య అని, స్కూల్‌లో ఆ పేరు నచ్చక రీతూ అని మార్చుకున్నట్లు చెప్పారు. ‘మా అమ్మ నాకు బాగా క్లోజ్. నాన్న లేరు. ఆయన ఉన్నప్పుడు ది బెస్ట్. నా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు.. నేను మాట్లాడిన తర్వాత ఆలోచిస్తా’ అంటూ చెప్పారు.

9. డిమోన్ పవన్
మూడో సామాన్యుడిగా డిమోన్ పవన్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. తాను జపనీస్ నవలలు చదువుతానని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. అందులో పాత్రలు మొదట వీక్‌గా ఉండి, ఆ తర్వాత బలంగా అవుతారని తాను కూడా జీవితంలో ఎదుగుతూ ఉండాలని ఆ పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. జపనీస్ కామిక్‌లో సూపర్ పవర్ సన్ గోకు అంటే ఇష్టమని చెప్పారు. తాను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతానని అందరూ అంటారని, అదే ఈ బిగ్‌బాస్ సీజన్‌లో తనకు యూజ్ అవుతోందని చెప్పుకొచ్చారు.

10. హీరోయిన్ సంజన గల్రానీ
‘బుజ్జిగాడు’ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటిసంజన గల్రానీ బిగ్‌బాస్ సీజన్9లోకి వెళ్లారు. ‘నేను చిన్నప్పటి నుంచి కష్టపడిపైకి వచ్చిన అమ్మాయిని. నేను నటించిన సినిమాలు, షోస్ గురించి మాట్లాడకుండా నేను ఎదుర్కొన్న కేసు గురించే అందరూ మాుట్లాడటం నాకెంతో బాధగా అనిపించింది. ఇది మంచిది కాదు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే నాకు ముఖ్యం. మీ అందరిలో ఉండే సగటు అమ్మాయిని నేను. నా భర్త డాక్టర్ అజీజ్‌ను నేనూ 2006 నుంచి స్నేహితులం. ఒకరినొకరు అర్థం చేసుకుని 2020లో పెళ్లి చేసుకున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లను వదిలేసి వస్తున్నా. కొన్ని సార్లు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నేను ఎదుర్కొంటున్న ఆరోపణలు నుంచి బయటకు రావాలని ఇక్కడకు పంపారు’’ అని సంజనా చెప్పుకొచ్చారు.

11. రాము రాథోడ్
‘రాను బొంబయికి రాను..’ అంటూ సోషల్ మీడియాను ఊపేసిన గాయకుడు రాము రాథోడ్. యూట్యూబ్ వేదికగా (51 కోట్లకు పైగా వ్యూస్) పాటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫంక్షన్స్, తీన్‌మార్ ఇలా ఏ ఊరేగింపు అయినా ఈ పాట లేకుండా అడుగు పడదు. అలాంటి ఫోక్ సాంగ్‌తో అలరించిన రాము రాథోడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. ‘లాక్‌డౌన్‌లో నా మ్యూజికల్ జర్నీ మొదలైంది. చిన్నప్పటి నుంచి స్కూల్, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో పాటలు పాడుతూ ఉండేవాడిని. నేను బేసిగ్గా డ్యాన్సర్‌ను. ఇతరుల పాటకే కాదు, మనం కూడా ఒక పాట క్రియేట్ చేసి డ్యాన్స్ చేయాలన్న ఆలోచన నుంచి వచ్చినవే నా పాటలు’ అని రాము అన్నారు.

12. శ్రీజ దమ్ము
సామాన్యుల కేటగిరీ నుంచి శ్రీజ దమ్ము బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

13. కమెడియన్ సుమన్ శెట్టి
సెలబ్రెటీ కేటగిరీ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి హాస్య నటుడు సుమన్ శెట్టి వెళ్లారు.

14. ప్రియా శెట్టి
సామాన్యుల కేటగిరి నుంచి ప్రియశెట్టి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

15. మర్యాద మనీష్
సామాన్యుల కేటగిరి నుంచి మర్యాద మనీష్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.



