SRK King Movie Update: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ (Shah rukh Khan) తాజాగా గాయపడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. షారూక్ గాయపడిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై ఆయనను హుటా హుటిన హాస్పిటల్‌కి తరలించినట్లు సమాచారం. తాత్కాలికంగా సినిమా షూటింగ్ ఆగింది.
వివరాల్లోకి వెళ్తే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ చేస్తున్న సెట్‌లో ఆయన గాయపడినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గాయాల తీవ్రత దృష్ట్యా, వైద్యులు ఆయన్ని ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే వైరల్ అవుతోన్న న్యూస్ చూసిన ఫ్యాన్స్ మాత్రం షారుఖ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తల్లోని నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
పఠాన్, జవాన్ చిత్రాలతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు కింగ్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇంకా ఈ మూవీలో దీపికా పదుకొనే, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణి ముఖర్జీ, జయదీప్ అహ్లావత్, హర్షద్ వార్షి వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం కింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ కీలక సమయంలోనే షారుఖ్ ఖాన్‌కు గాయాలయ్యాయని వార్తలు రావడం ‘కింగ్’ సినిమా బృందానికి కూడా ఆందోళన కలిగించే విషయం. షారుఖ్ ఖాన్ గాయపడిన వార్త నిజమైతే, అది ‘కింగ్’ సినిమా షూటింగ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.
వరుస పరాజయాల్లో ఉన్న షారూక్ ఖాన్ దాదాపు హీరోగా నటించటానికి నాలుగేళ్లు సమయం తీసుకున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో చేసిన పఠాన్‌తో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించారు. తర్వాత అట్లీ దర్శకత్వంలో షారూక్ చేసిన జవాన్ మూవీ కూడా వెయ్యి కోట్లు వసూళ్లను సాధించింది. ఆ తర్వాత డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చేసిన డుంకీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు కింగ్‌తో సందడి చేయటానికి సిద్ధమవుతున్నారు.


