Saiyaara OTT Date: ఇటీవలే విడుదలై ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టించిన బాలీవుడ్ లవ్ స్టోరీ ‘సయారా’ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీకి అక్కడి వారు మంచి ఆదరణ చూపించారనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేసింది. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది.
నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ‘సయారా’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. భారతదేశంలో ఈ చిత్రం రూ.320 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో అయితే, ఈ సినిమా విక్కీ కౌశల్ నటించిన ఛావా వసూళ్లను కూడా అధిగమించిందని సమాచారం. ఈ అద్భుతమైన వసూళ్లతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ చిత్రంగా ‘సయారా’ నిలిచింది.
‘సయారా’ ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. తన కాలేజ్‌లో రైటర్ అయిన సీనియర్‌ని ప్రేమించి హీరోయిన్.. వాళ్ల ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతుంది. అయితే అతను స్వార్థం చూసుకుని వెళ్లిపోతాడు. దాంతో ఆమె ఎంతో బాధపడుతుంది. చివరకు ఓ ఐటీ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తి పరిచయం అవుతాడు. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో హీరోయిన్ జీవితంలోకి ఆమె మాజీ ప్రేమికుడు కూడా వస్తాడు. మరి ఇద్దరిలో హీరోయిన్ ఎవరి దగ్గరకి చేరిందనేదే కథాంశం.
బ్లాక్‌బస్టర్ ‘సయారా’ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటీనటులైన అహాన్ పాండే, అనీత్ పద్దా ప్రధాన పాత్రలలో నటించి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా రివీల్ అయ్యింది. ఈ రొమాంటిక్ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని‘సయారా’ మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే ప్రభావాన్ని చూపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


