Salman Khan Comments On Trump: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలే కాదు.. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యల కారణంగా సాధారణంగా వినోదాత్మకంగా ఉండే బిగ్‌బాస్ షోలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
తాజాగా ప్రసారమైన బిగ్‌బాస్ 19వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య చోటు చేసుకుంటున్న గొడవలు, వివాదాలపై హోస్ట్ సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఇంట్లో గొడవలకు కారణమవుతూనే.. తామే శాంతి దూతలుగా చెప్పుకుంటున్న కొందరు కంటెస్టెంట్‌ల తీరును ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంలోనే ‘ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడండి. సమస్యలను సృష్టించే వారే ఇప్పుడు శాంతి బహుమతి కావాలని అడుగుతున్నారు’ అంటూ సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ తన వ్యాఖ్యలలో ఎవరి పేరునూ స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు నేరుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించినవేనని అందరికీ అర్థమవుతుంది. ఆయనలా చెప్పటానికి గల కారణాలు కూడా మనకు తెలిసిందే. గత కొంతకాలంగా తాను భారత్-పాకిస్థాన్ సహా అనేక అంతర్జాతీయ వివాదాలు, యుద్ధాలను ఆపానని కాబట్టి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పలువురు నెటిజన్లు వివిధ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ చాలా ధైర్యంగా ఎవరికీ భయపడకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారని కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక సాధారణ వినోద రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెటించడం విశేషం. ఈ వ్యాఖ్యలు కేవలం బిగ్‌బాస్ హౌస్ గొడవల గురించి మాత్రమే కాకుండా ప్రపంచ పరిణామాలపై సల్మాన్ ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కామెంట్స్ సల్మాన్‌కు ఏదేని సమస్యను తెచ్చి పెడుతుందేమో చూడాలి మరి.
సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ చేసిన సికిందర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు సల్మాన్ ఖాన్.
Also Read – Rajamouli: రాజమౌళికే పోటీగా..


