Sridevi Property Controversy: దురదృష్టవశాత్తు, శ్రీదేవి 2018లో మరణించారు. ఆమె మరణానంతరం ఆస్తికి సంబంధించిన ఈ వివాదం ఆమె కుటుంబానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే.. శ్రీదేవికి సంబంధించిన ఆస్తి వ్యవహారం కారణంగా ఆమె భర్త బోనీ కపూర్ కోర్టు మెట్లెక్కారు. శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం సినీ వర్గాల్లోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఆస్తి వివరాలు..
బోనీ కపూర్ సమర్పించిన పిటిషన్ ప్రకారం శ్రీదేవి 1988 ఏప్రిల్‌లో మద్రాసులోని ఎంసీ సంబంద మొదలియార్ అనే వ్యక్తి వద్ద ఈ స్థిరాస్తిని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుకు ముందు, శ్రీదేవి అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారని బోనీ కపూర్ తెలిపారు. మొదలియార్‌కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో అన్ని చట్టపరమైన అంశాలను సరిచూసుకున్న తర్వాతే శ్రీదేవి ఈ ఆస్తిని తన పేరు మీదకు మార్చుకున్నారని బోనీ కపూర్ వెల్లడించారు.
వివాదానికి దారితీసిన అంశాలు….
శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తి విషయంలో కొత్త చిక్కులు తలెత్తాయి. ఎంసీ సంబంద మొదలియార్ రెండో భార్య కుమారులు ఈ ఆస్తిలో తమకు వాటా ఉందని వాదిస్తూ తహశీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేశారని బోనీ కపూర్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో ప్రస్తుతం వారు చట్టవిరుద్ధంగా ఈ ఆస్తిపై హక్కులను సొంతం చేసుకున్నారని బోనీ కపూర్ ఆరోపించారు. మొదలియార్ తన భార్య బతికి ఉండగానే రెండో వివాహం చేసుకున్నారన్న విషయాన్ని బోనీ కపూర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలన్నీ శ్రీదేవి ఆస్తిపై అక్రమ హక్కులకు దారితీశాయని బోనీ కపూర్ వాదన. అక్రమ కబ్జాలు, మోసపూరిత పత్రాలను రద్దు చేయాలని కోరుతూ బోనీ కపూర్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఆయన తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. తన భార్య ఎంతో కష్టపడి ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిందని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
హైకోర్టు ఆదేశాలు..
బోనీ కపూర్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్‌ను నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇది కేసులో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించబడుతోంది.
శ్రీదేవి వ్యక్తిగత జీవితం: కాగా, శ్రీదేవి 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దురదృష్టవశాత్తు, శ్రీదేవి 2018లో మరణించారు. ఆమె మరణానంతరం ఆస్తికి సంబంధించిన ఈ వివాదం ఆమె కుటుంబానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కోర్టు ఆదేశాల మేరకు తహశీల్దార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఈ ఆస్తి వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.
Also Read – AA22A6: ఆస్కార్ రేంజ్ లో బన్నీ సినిమా..


