Akhanda 2 : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2:తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీఎఫెక్స్ వర్క్ వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకి డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. గతంలో అఖండ కూడా కరోనా తర్వాత ఇలాగే డిసెంబర్ లో వచ్చి భారీ సక్సెస్ ని సాధించింది.
ఇప్పటికే, బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వరుస హిట్స్ తో హ్యాట్రిక్ సాధించారు. ఈ క్రమంలో ఇదే క్రేజీ కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు. నిన్నా మొన్నటి వరకూ అఖండ తాండవం నుంచి అప్‌డేట్స్ రాకపోయేసరికి మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయి, 2026 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
కానీ, బోయపాటి అండ్ టీమ్ ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అఖండ 2:తాండవం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 5న వచ్చేస్తుందని కుండ బద్దలు కొడుతూ ఏకంగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడం అభిమానులకి పెద్ద సర్‌ప్రైజ్. ఇక, బాలయ్య ముంబై ఈవెంట్ లో మాట్లాడిన హిందీ స్పీచ్ అందరికీ షాకిచ్చేలా చేసింది.
ఇదే హాట్ టాపిక్ అనుకుంటే, ఇప్పుడు బోయపాటి 3డి లో అఖండ 2 తాండవం చూడబోతున్నారని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతవరకూ బాలయ్య సినిమాలు మిగతా భాషలలో డబ్బింగ్ అయ్యేవి. కానీ, మొదటిసారి అఖండ 2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఈవెంట్ ని ముంబైలో నిర్వహించారు. అలా, వరుస అప్‌డేట్స్ మొదలు పెట్టిన చిత్రబృందం, హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఊపు చూస్తుంటే మరోసారి బాలయ్య-బోయపాటి తాండవం ఆడేందుకు రెడీ అవుతున్నారని అర్థమవుతోంది.


