Nidhhi Agerwal Controversy: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కథానాయిక నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేకపోయినా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్‌గా ఆమె పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించిన ది రాజా సాబ్ మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల ఆమె భీమవరంలో జరిగిన ఒక ఈవెంట్ లో ప్రయాణించిన వాహనంపై తలెత్తిన వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విడుదలైన నిధి అగర్వాల్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు, పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో, భీమవరంలో జరిగిన ఒక ఈవెంట్‌కు నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, ఈ సంఘటనపై పలు ఊహాగానాలు చెలరేగాయి, ప్రభుత్వ అధికారులు ఆమెకు ఆ వాహనాన్ని పంపారని తప్పుగా ప్రచారం జరిగింది.
ఈ వివాదంపై నిధి అగర్వాల్ స్వయంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘భీమవరంలో జరిగిన స్టోర్ లాంచ్ ఈవెంట్ కోసం నేను వచ్చినందుకు సోషల్ మీడియాలో వ్యాపించిన ఊహాగానాలను పరిష్కరించడానికి నేను ఇష్టపడుతున్నాను’ అని పేర్కొన్నారు. ‘ఈ కార్యక్రమంలో, స్థానిక నిర్వాహకులే నాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాహనం’ అని ఆమె వివరించారు. ‘ఈ వాహనాన్ని ఎంచుకోవడంలో లేదా అభ్యర్థించడంలో నాకు ఎటువంటి పాత్ర లేదని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దీనిని లాజిస్టికల్ ప్రయోజనాల కోసం మాత్రమే ఈవెంట్ నిర్వాహకులు అందించారు’ అని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు.
కానీ సోషల్ మీడియాలో కొందరు ప్రభుత్వ అధికారులు తనకు వాహనం పంపారని తప్పుగా రాశారని, అయితే ఆ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని ఆమె ఖండించారు. ఈ సందర్భంలో తనకు అలాంటి సంబంధం లేదని, వాహనం వాడకానికి ఏ ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదని నిధి తేల్చిచెప్పారు.
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025
ఈ సంఘటనకు సంబంధించి ఈవెంట్ కోఆర్డినేటర్ పవన్ కుమార్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘విజయవాడలో ఇర్ఫాన్ అనే వ్యక్తితో కారు అరేంజ్ చేయించాం. కారు బ్రేక్ డౌన్ కావడంతో నాగరాజు అనే వ్యక్తికి చెందిన ట్రావెల్స్ కారును ఉపయోగించామం’ అని వెల్లడించారు. అయితే, ‘అది గవర్నమెంట్ కు పనిచేస్తుందని తెలియదు. ఈవిషయాన్ని రాజకీయం చేయెద్దు’ అని అన్నారు. ఈ వివరణతో ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక చర్య ఏదీ లేదని, కేవలం అనుకోని పరిస్థితుల వల్లే ప్రభుత్వానికి చెందిన వాహనాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
నిధి అగర్వాల్ కారు వివాదంపై ఆమె స్వయంగా, అలాగే ఈవెంట్ నిర్వాహకులు ఇచ్చిన స్పష్టతతో పూర్తి విషయం అర్థమవుతోంది. ఈ వ్యవహారాన్ని అనవసరంగా రాజకీయం చేయవద్దని పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం తన సినీ కెరీర్ లో బిజీగా ఉన్నారని, ఇలాంటి వివాదాలు ఆమె కెరీర్ పై ప్రభావం చూపకుండా ఆమె తన పనిని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


