Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Celebrities Pays Tribute to Kota Srinivasa Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తపరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, జగన్, ఇతర ప్రముఖలు కోట కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సినీ రంగంలో విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. కోట మరణంతో సినీ రంగం ఓ గొప్ప నటుడికి కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుంబధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఓ పిసినారిగా, క్రూరమైన విలన్‌గా, మధ్య తరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయారన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని వెల్లడించారు.

Kota Srinivasa Rao

కోట శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త తనను ఎంతో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి వాపోయారు. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఇద్దరం ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కోట లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి, ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad