CM Chandrababu: సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దిగ్గజ నటులతో ఆమె కలిసి నటించారు. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తదితరులు తమ సంతాపం తెలియజేశారు.
అలనాటి ప్రముఖ నటి బి. సరోజాదేవి బెంగుళూరులో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారం కలిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో హీరోయిన్‌గా ఆమె అనేక ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. మహా నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారని గుర్తుచేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను పేర్కొన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆమె మృతి పట్ల తన సంతాపం తెలియజేశారు. 200కి పైగా సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకున్న సరోజాదేవి ఇక లేరనే వార్త బాధించిందన్నారు. భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారని తెలిపారు. సరోజాదేవి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని వెల్లడించారు.
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారని కొనియాడారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారని.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని వెల్లడించారు.
Also Read: సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూత
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సరోజాదేవి మరణ వార్త అత్యంత బాధాకరమని బాలకృష్ణ తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడంలో రాజ్ కుమార్‌లతో ఏకకాలంలో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ సరోజాదేవి అన్నారు. సరోజాదేవి జీవితం రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని పేర్కొన్నారు.


