Mega 157: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్‌గారు అనే టైటిల్ ఫిక్సయ్యింది. స్పెషల్ వీడియో ద్వారా చిరంజీవి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జీపు నుంచి దిగుతూ చిరంజీవి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. నోటిలో సిగరెట్, కళ్లాద్ధాలు ధరించి మాస్, క్లాస్ మిక్స్‌డ్‌గా చిరంజీవి లుక్ కనిపిస్తోంది. చివరలో గన్ భుజంపై పెట్టుకొని చిరంజీవి మెట్లు దిగి వచ్చే సీన్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.
వింటేజ్ చిరు…
సిగరేట్ విసిరేసే స్టైల్, ఆయన నడక, మ్యానరిజమ్స్ అన్ని వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుచేస్తున్నాయి. చిరంజీవి క్లాసిక్ సినిమాలను గుర్తుచేసేలా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో గ్లింప్స్ చూస్తుంటే చిరంజీవి కమాండోలకు హెడ్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మన శంకరవరప్రసాద్‌గారు పండుగకు వచ్చేస్తున్నారంటూ అంటూ వెంకటేష్ వాయిస్ ఓవర్ టైటిల్ గ్లింప్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్ టైమ్ కాంబో…
మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి చేస్తున్న మొదటి మూవీ ఇదే కావడం గమనార్హం ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కేథరిన్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్…
చిరంజీవి హీరోగా నటిస్తున్న 157వ మూవీ ఇది. 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మన శంకరవరప్రసాద్‌గారు నెక్స్ట్ షెడ్యూల్ కొచ్చిలో జరుగనుంది. ఈ షెడ్యూల్‌లోనే వెంకటేష్ ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది.
మరో రెండు సినిమాలు…
మన శంకరవరప్రసాద్‌గారుతో పాటు విశ్వంభర సినిమా చేస్తున్నాడు చిరంజీవి. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు డైరెక్టర్ బాబీతో మరో మూవీ చేయనున్నాడు. వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సెకండ్ మూవీని నేడు అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.


