Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ మధ్య చిరకాలంగా స్నేహం వర్ధిల్లుతోంది. ఆ ఇద్దర్నీ కలిపి వెండితెరపై చూడాలని దశాబ్దాలుగా ఇరువురి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు వారి కోరిక తీరబోతోంది. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీమామ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. బుధవారమే ఆయన సెట్స్ మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ అయ్యింది.
37 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇటు చిరంజీవి, అటు వెంకటేష్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లోని ఐకనిక్ మూమెంట్స్‌ని ప్రదర్శించాక, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సెట్స్‌కి వెంకటేశ్ వచ్చిన సన్నివేశాలను చూపించారు. ఆపైన ఇద్దరు స్టార్స్ కలుసుకొని హగ్ చేసుకోవడాన్ని ‘బ్లర్ ‘ చేసి చూపించారు. ఈ సందర్భంగా నేపథ్యంలో, “వెల్‌కమ్ వెంకీ.. మై బ్రదర్. తెలుసా మై బాస్..” అంటూ చిరంజీవి చెప్పడం వినిపిస్తుంది. ఈ వీడియోను కట్ వెనుక ఉన్నది డైరెక్టర్ అనిల్ రావిపూడి అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఈ వీడియో మొదట్లో “Two of the most celebrated stars come together to bring you” అనే లైన్, చివరలో “The biggest family entertainer of Telugu Cinema” అనే లైన్ కనిపిస్తాయి. రెండింటినీ కలిపి చదువుకుంటే ఈ సినిమా ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది.
ఈ వీడియోను షేర్ చేసిన చిరంజీవి, “Welcoming my dear friend, Victory
@VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family.. Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres” అని రాసుకొచ్చారు. చిరంజీవి పోస్ట్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రిపోస్ట్ చేసి, “Happy to share the screen with my dear Megastar @Kchirutweets in #ManaShankaraVaraPrasadGaru.. And back again with my most favourite @AnilRavipudi for another Sankranthi.. This Sankranthi is going to be a truly special one” అని రాశారు వెంకటేష్.
ఇక ఈ సినిమాలో వెంకటేశ్ చేస్తోంది రెండు మూడు నిమిషాలు కనిపించే అతిథి పాత్ర కాదు. ప్రిక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఉండే ఒక కీలక పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్ర వెంకటేశ్ చేస్తే బాగుంటుందని నమ్మిన దర్శకుడు అనిల్, ఆ విషయాన్ని చిరంజీవితో పంచుకోవడంతో, ఆయన ఆనందంగా ఒప్పుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. మూవీకి వెంకీ క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్ తెస్తుందని అంటున్నారు.
నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి విడుదలవుతోంది. భీమ్స్ సెసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


