Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభCM Chandrababu: కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

CM Chandrababu: కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

CM Chandrababu Pay Tribute to Kota Srinivasarao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమని తెలిపారు. తాను 1999లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ తరపున విజయవాడ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలిచారని గుర్తుచేసుకున్నారు. తన విలక్షణమైన నటన ద్వారా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఒకే సీన్‌లో వివిధ హావభావాలు పలికించగలిగిన గొప్ప నటుడు అని ప్రశంసించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 750 సినిమాల్లో నటించారని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని వెల్లడించారు.

- Advertisement -

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కూడా కోట భౌతికకాయానికి నివాళులర్పించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పార్థివదేహానికి పూలమాల వేసి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి వార్త తనకు ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. అందరికీ ఇష్టమైన వ్యక్తి కోట అని తెలిపారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్ణకరమన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నటించేటప్పుడు తాను చనిపోయేవరకు నటిస్తానని తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… విలక్షణమైన నటనకి కోట ప్రతిరూపమని తెలిపారు. తమ ఇద్దరి నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’ సినిమాతోనే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. తమ మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. కోట చేయని క్యారెక్టర్లు, పలకని యాసలు లేవని కొనియాడారు. అలాంటి వ్యక్తి ఇక లేరంటే తట్టుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Also Read: కూలిన ‘కోట’.. డాక్టర్ కావాలని యాక్టర్‌గా మారి

వీరితో పాటు తెలుగు ప్రముఖ నటులు బాబు మోహన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, ప్రకాశ్ రాజ్ తదితరులు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, బాబుమోహన్ కోట భౌతికకాయాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధం గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad