CM Revanth Reddy about Film Workers Issue: వేతన పెంపుకు సంబంధించిన 17 రోజులుగా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మె చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెను విరమింప చేయటానికి, నిర్మాతలు, ఫెడరేషన్‌కు మధ్య సయోధ్య కుదర్చటానికి ఫిల్మ్ ఛాంబర్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సమ్మె ఈరోజు ఆగిపోతుంది.. రేపు ఆగిపోతుందంటూ అంటున్నారే కానీ, శుభం కార్డు పడటం లేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు సైతం తమదైన సూచనలు చేసినప్పటికీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. అదే సమయంలో సమస్య రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. దాంతో ఆయన సమ్మె సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ సమస్య కొత్త మలుపు తీసుకుంది.
నిజానికి బుధవారానికి సమ్మెను విరమించేలా ప్రకటన వస్తుందని ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు అనౌన్స్ చేశారు. అయితే బుధవారం నాటకీయంగా సమ్మె మలుపు తీసుకుంది. చాంబర్‌తో చర్చలకు రావాల్సిన నిర్మాతలు రాలేదు. ఫెడరేషన్ ప్రతినిధులు కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కారణం.. రంగంలోకి తెలంగాణ ప్రభుత్వాధికారులు ఎంట్రీ ఇవ్వటమే.
హైదరాబాద్‌ను ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హబ్‌గా చేయాలనుకుంటే సమ్మె కారణంగా షూటింగ్స్ వాయిదాలు పడుతున్నాయని, కేవలం తెలుగు సినిమాలే కాదు, ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటోన్న ఇతర సినిమాలన్నీ ఆగిపోయాయనే సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. దీన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. సమస్యను పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించటంతో కొత్త మలుపు తీసుకుంది. మరిప్పుడు సినీ కార్మికులు ఎలా ముందుకు వెళతారనే దాన్ని అందరూ గమనిస్తున్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే దిశగానే చర్చలు సాగుతున్నాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి వేతన పెంపు విషయం, నిర్మాతలు ఫెడరేషన్‌కు పెట్టిన కండీషన్స్ వంటి విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mammootty-health-update-from-his-brother/
సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు కావాలంటూ ప్రారంభమైన సమ్మెను కొనసాగుతూనే ఉంది. ముందు 5 శాతం మాత్రమే ఇస్తామన్న నిర్మాతలు తర్వాత దాన్ని మూడు సంత్సరాల్లో 25 శాతం చేస్తామని అన్నారు. అయితే అది రూ.2000 మాత్రమే తీసుకునే కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. దాని వల్ల డాన్సర్స్, ఫైటర్స్, కెమెరామెన్ యూనియన్స్ నష్టపోతాయని ఫెడరేషన్ ఒప్పుకోలేదు. చివరకు రూ.5 వేలు తీసుకునే కార్మికులకు ఏడాది ఐదు శాతం చొప్పున వేతనం పెంచుతామని అన్నారు. అయితే కొన్ని కండీషన్స్‌కు ఒప్పుకోవాలని అన్నారు.
ఫ్లెక్సిబుల్ కాల్‌షీట్, సెకండ్ సండే, గవర్నమెంట్ హాలీడేస్ మాత్రమే డబుల్ కాలీషీట్..మిగతా రోజులకు నార్మల్ కాల్షీట్, రేషియో, యూనియన్స్‌కు సంబంధం లేకుండా టెక్నీషియన్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పని చేయించవచ్చు, ఈ కండీషన్స్‌లో ఫ్లెక్సిబుల్ కాల్‌షీట్ కండీషన్ మినహా మిగతా వాటికి ఫెడరేషన్ ఒప్పుకుంది.


