CM Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమకు వేదికగా మార్చాలనేది తన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌కి సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సినీ పరిశ్రమ భవిష్యత్తుపై కీలక ప్రకటనలు చేశారు.
ఐటీ, ఫార్మా పరిశ్రమల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినీ కార్మికుల మద్దతు ఉంటే, హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భారత ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు రేవంత్. తాను కార్మికుల కష్టాలు తెలియనివాడిని కాదంటూ.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున చేయగలిగిన పనులన్నీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Also Read – Ramayana: రెమ్యూనరేషన్ లేకుండా రామాయణ సినిమా చేస్తున్న బాలీవుడ్ స్టార్ – నెటిజన్ల ప్రశంసలు
సినీ కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, దానిలో ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సినీ కార్మికుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మించి వారికి ఉచితంగా చదువు చెప్పిస్తామని సీఎం తెలిపారు. అంతేకాక, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు. సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలకమైన ప్రకటన చేశారు. టికెట్ల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20శాతం కార్మికులకు కేటాయిస్తేనే సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తామని స్పష్టం చేశారు.
గత పదేళ్లుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ అవార్డులు ఇవ్వలేదని, అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read – Samantha: ‘సో ఎలిగెంట్’.. నీలిరంగు చీరలో సమంత హొయలు


