Sun Pictures: పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ కూలీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ఫస్ట్ వీకెండ్‌లో పర్వాలేదనిపించిన ఈ మూవీ మండే టెస్ట్‌లో మాత్రం ఫెయిలయ్యింది. సోమవారం నుంచి కూలీ మూవీ వసూళ్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం రోజు 35 కోట్ల వరకు వసూళ్లు రాగా.. సోమవారం 12 కోట్లకు కలెక్షన్స్ పడిపోయాయి. మంగళవారం పది కోట్ల లోపే ఈ సినిమా కలెక్షన్స్ దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆరు రోజుల్లో కూలీ మూవీ అతి కష్టంగా నాలుగు వందల కోట్ల మార్కును దాటింది.
యాభై ఐదు శాతం మాత్రమే…
దాదాపు ఏడు వందల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన కూలీ ఇప్పటివరకు యాభై ఐదు శాతం మాత్రమే రికవరీ సాధించింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో మూడు వందల కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాల్సివుంది.
సెన్సార్ నుంచి…
నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు మేకర్స్. సెన్సార్ నుంచి సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం కూడా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడానికి ఓ కారణమని భావిస్తున్నారు. అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ వల్లే హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటుందనే అపోహతో చాలా మంది ఫ్యామిలీ ఆడియెన్స్ కూలీ సినిమాకు దూరమయ్యారని భావించిన మేకర్స్ సెన్సార్ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నై హై కోర్టును ఆశ్రయించారు. కూలీ కంటే ఎక్కువగా వయలెన్స్ ఉన్న సినిమాలకు యూఏ ఇచ్చారని, చాలా తక్కువ హింసాత్మక సన్నివేశాలున్న తమ సినిమాకు మాత్రం అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ఇచ్చి అన్యాయం చేశారంటూ ఎమర్జెన్సీ హియరింగ్ పిల్ వేసింది సన్ పిక్చర్స్. ఈ కేసుపై బుధవారం (నేడు) తీర్పు వెలువడనుంది.
కలెక్షన్స్ పెరుగుతాయా?
ఈ విచారణలో సన్ పిక్చర్స్‌కు అనుకూలంగా తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఏ సర్టిఫికెట్‌ను యూఏగా మార్చిన కలెక్షన్స్ పెరగడం మాత్రం అనుమానమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రిలీజ్‌కు ముందే కోర్టును ఆశ్రయిస్తే రిజల్ట్ మాత్రం మరోలా ఉండేదని, చాలా ఆలస్యంగా మేకర్స్ రియలైజ్ అయ్యారని చెబుతున్నారు. యూఏ సర్టిఫికెట్‌తో రిలీజైతే ఈ సినిమా ఈ పాటికి ఐదు వందల కోట్లను దాటేసి ఉండేదని కోలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. యూనానమస్‌గా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు యూఏ వచ్చిన సినిమాకు ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు.
Also Read- Salon Stroke : అందానికి ‘స్ట్రోక్’ – పార్లర్‌లో పక్షవాతం! హెయిర్ వాష్‌తో తస్మాత్ జాగ్రత్త!
ఓటీటీ, శాటిలైట్…
అయితే యూఏ సర్టిఫికెట్ వల్ల ఓటీటీతో పాటు శాటిలైట్ బిజినెస్‌కు ప్లస్సయ్యే అవకాశం ఉంది. ఏ సర్టిఫికెట్‌తో శాటిలైట్ హక్కులను అమ్మడం చాలా కష్టం. ఒకవేళ అమ్మిన వయలెన్స్‌తో కూడిన చాలా సీన్లకు కత్తెర వేయాల్సివుంటుంది. డిజిటల్, శాటిలైట్ హక్కులను దృష్టిలో పెట్టుకొనే మేకర్స్ తెలివిగా కోర్టును ఆశ్రయించారని అంటున్నారు. థియేటర్లలో ఏర్పడిన నష్టాలను డిజిటల్, శాటిలైట్ రైట్స్‌తో రికవరీ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు చెబుతోన్నారు. కోర్టు తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వస్తుందో లేదో అన్నది తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, సౌబీన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు.


