Hit 3: నేచురల్ స్టార్ నాని హీరోగానే కాదు.. నిర్మాతగానూ అభిరుచి మేరకు వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయనకు నిర్మాతగా మిక్స్‌డ్ ఫలితమే ఎదురైందనాలి. ఎందుకంటే ఆయన నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత నాని హీరోగా నటిస్తూ నిర్మించిన హిట్ 3 మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేదు. నిజానికి ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మాతగా నానికి లాభాలను తెచ్చి పెట్టినప్పటికీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు నష్టాలనే మిగిల్చింది.
HIT 3 సినిమాను ఏ టైమ్‌లో స్టార్ట్ చేశాడో తెలియదు కానీ.. ఇప్పటి వరకు వివాదాలకు దూరంగా ఉండే నాని, ఈ సినిమా పుణ్యమాని కాంట్రవర్సీకి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విడుదలైన ఇన్ని రోజుల తర్వాత హిట్ 3 మూవీ వచ్చిన వివాదమేంటా? అనే అనుమానం రాక మానదు. వివరాల్లోకెళ్తే.. తమిళనాడుకి చెందిన విమల్ అనే వ్యక్తి హిట్ 3 కథ నాదంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పరిశీలించిన కోర్టు నోటీసులు జారీ చేయటంతో ఈ కేసుకి ప్రాధాన్యత పెరిగింది.
విమల్ తన కథను 2021 ఆగస్టు 4న దక్షిణ భారత సినిమా రచయితల సంఘంలో అధికారికంగా నమోదు చేశారు. అనంతరం 2022 ఆగస్టు 8న ఆ కథకు సంబంధించిన సినాప్సిస్‌ను నానికి పంపినట్టు తెలియజేశారు. అయితే, ఏ స్పందన రాకపోయినా, సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత చూసినప్పుడు అది తన కథతో స్ట్రయికింగ్ సిమిలారిటీస్ ఉన్నాయని విమల్ ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కారు. కథా నిర్మాణం, పాత్రలు, క్యారెక్టర్ ఆర్క్స్, స్క్రీన్ ప్రెజంటేషన్ మొదలైనవి తాను రాసిన స్క్రిప్ట్‌తో దాదాపుగా కలిసిపోతున్నాయని విమల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. . కేవలం కొన్ని మార్పులతో కథను అడాప్ట్ చేశారని ఆయన హిట్ 3 మూవీ మేకింగ్ గురించి విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో, విమల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి HIT 3కి సంబంధించిన హక్కుల విక్రయాన్ని నిలిపివేయాలని, సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో 20% నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే సినిమా లాభాలపై అకౌంటింగ్ రిపోర్ట్ సమర్పించాలని పేర్కొన్నారు. ఆయన పిటిషన్‌కి స్పందించిన న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామమూర్తి, జూలై 7, 2025 లోపు వివరణ ఇవ్వాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అలాగే, ఈ కేసు కమర్షియల్ కోర్ట్ యాక్ట్ సెక్షన్ 12A ప్రకారం మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొంటూ మినహాయింపును కూడా కోరారు. ఈ పరిణామాలతో టాలీవుడ్‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులపై మరోసారి చర్చలు మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈ కేసు ఎలా తేలుతుందో.. హీరో, నిర్మాతగా వ్యవహరించిన నాని ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే మరి.