బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ను చంపుతానని బెదిరింపులు రావడం బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. బెదిరింపులకు పాల్పడింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయవాది అని అనుమానించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గురువారం అతనిని కోర్టులో హాజరుపరచగా… నిందితుడిని నవంబర్ 18 వరకు పోలీసు కస్టడీకి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, నిందితుడు ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత మహారాష్ట్రకు తీసుకొచ్చారు. నిందితుడిని పోలీసులు గురువారం బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. బెదిరింపుల వ్యవహారంపై విచారణ కోసం ఏడు రోజుల రిమాండ్‌ను కోరారు.
Also Read : వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్.. పూరి జగన్నాథ్
మరోవైపు నిందితుడి తరపు న్యాయవాదులు అమిత్ మిశ్రా, సునీల్ మిశ్రా మాట్లాడుతూ… ఫైజాన్ ఖాన్ ఫోన్ చోరీకి గురైందని కోర్టుకి తెలిపారు. ఆ ఫోన్ నుండి వచ్చిన బెదిరింపు కాల్ అతనిపై కుట్ర అని వారు వాదించారు. ఎందుకంటే జింకలను వేటాడడాన్ని ప్రస్తావిస్తూ ‘అంజామ్’ (1994) సినిమాలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) డైలాగ్‌పై ఫైజాన్ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కుట్రపూరితంగా ఈ కేసులో ఫైజాన్ ఖాన్ ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నిందితుడి తరపు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి నవంబర్ 18 వరకు పోలీసు కస్టడీ విధించింది.